బీజేపీ స్టేట్ ఆఫీసులో.. నిజామాబాద్​ నేతల ఆందోళన

బీజేపీ స్టేట్ ఆఫీసులో..  నిజామాబాద్​ నేతల ఆందోళన
  • మండల పార్టీ అధ్యక్షుల మార్పుతో ఎంపీ అర్వింద్​పై ఫైర్​
  • నిరసన వద్దన్న రాష్ట్ర నేతలతో వాగ్వాదం
  • పార్టీ ఆఫీసులో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్, వెలుగు:  నిజామాబాద్​జిల్లాకు చెందిన బీజేపీ నేతలు బుధవారం పార్టీ స్టేట్​ఆఫీస్​లో ఆందోళనకు దిగారు. రాష్ట్ర పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్​పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల​పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఎంపీ ఒత్తిడితో జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య మొత్తం 13 మండలాల పార్టీ అధ్యక్షులను మార్చారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా అర్వింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫీసులోనే ఉన్నారు. కాగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, ఆఫీసు ఇన్​చార్జి ఉమా శంకర్ తో పాటు పలువురు రాష్ట్ర నేతలు వచ్చి నిరసన వద్దని నచ్చజెప్పగా వారిపైకి ఎదురు తిరిగారు. దీంతో రాష్ట్ర పార్టీ నేతలకు, నిజామాబాద్ క్యాడర్​కు మధ్య కొద్ది సేపు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కిషన్ రెడ్డి జోక్యంతో వెనుదిరిగిన నాయకులు

చివరకు కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని ఆందోళన చేస్తున్న నాయకులను తన ఛాంబర్ కు పిలిపించుకొని మాట్లాడారు. వారు చెప్పిన విషయాలన్నింటిని ఓపికగా విని.. ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ తర్వాత సమస్యను పరిష్కరిస్తానని, అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు. ఒక దశలో నిజామాబాద్ నాయకుల తీరుపై కిషన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత  విషయాలపై ఇలా బహిరంగంగా నిరసన తెలపడం ఏంటి.. పార్టీ స్టేట్ ఆఫీసులో ఆందోళన చేయడం బీజేపీ కార్యకర్తల సంస్కృతా.. ఇదేం పద్దతి అంటూ.. వారిపై ఫైర్ అయ్యారు. దీంతో వారు వెనుదిరిగారు. ఈ ఆందోళనలో ఆర్మూర్​కు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ కుమార్ రెడ్డితో పాటు బోధన్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలు, తొలగించిన పలువురు మండల పార్టీ అధ్యక్షులు, వారి అనుచరులు పాల్గొన్నారు.