- 22 ఏ, వెయ్యి రోజుల పాలన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చలు
- సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, మండలి సమావేశాల నిర్వహణపై జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఉభయ సభలను ఈనెల 12 వరకు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై అవసరమైతే మరోసారి సమీక్ష జరపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగిన శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు అజెండా రూపొందించారు.
ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావుకు ఫోన్ చేసిన స్పీకర్.. బీఏసీకి అటెండ్ కావాలని కోరారు. అయితే తెలంగాణ భవన్‌లో ఉన్న హరీశ్‌రావును పోలీసులు అడ్డుకోవడంతో.. ఈ సమావేశాన్ని బహిష్కరించినట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ బీఏసీ సమావేశంలో 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్, చట్టసభల్లోకి వచ్చేందుకు ఎన్నికల్లో పోటీ చేసే వయస్సు తగ్గింపు, వెయ్యి రోజుల పాలనలాంటి అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
దీంతోపాటు మరో 22 కీలకమైన అంశాలపై చర్చ జరిపేందుకు కనీసం 15 రోజులపాటు అసెంబ్లీలో సమావేశాలు నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు మైనారిటీ అంశాలపైనా అసెంబ్లీలో చర్చలు జరపాలని ఎంఐఎం నేత బలాలా కోరారు. ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
వారంపాటు మండలి సమావేశాలు
మరోవైపు శాసనమండలి సమావేశాలను వారంపాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించినట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. సభ్యుల కోరిక మేరకు అవసరమైతే మరిన్ని రోజులు పొడిగిస్తామని పేర్కొన్నారు. సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆయన చాంబర్‌లో మండలి బీఏసీ సమావేశం నిర్వహించగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శ్రీపాల్ రెడ్డి, శాసన మండలి సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.
