అసెంబ్లీని కామెడీ సినిమాలా మార్చిన్రు: బోరెడ్డి అయోధ్యరెడ్డి

 అసెంబ్లీని కామెడీ సినిమాలా మార్చిన్రు: బోరెడ్డి అయోధ్యరెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారం చేపట్టి తొమ్మి దేండ్లవుతున్నా అసెంబ్లీని ఎలా నడపాలో బీఆర్ఎస్ సర్కారుకు ఇంకా తెలియడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఓ కామెడీ సినిమా అనుకునేలా నేతలు మార్చేశారని విమర్శించారు. కేటీఆర్, మల్లారెడ్డి జోకర్లుగా మారారన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. 

అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం రేవంత్​ రెడ్డిని విమర్శించేందుకే పెట్టినట్టుగా ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో రేవంత్​ లేవనెత్తిన అంశాలపై ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. రేవంత్​ను కేసీఆరే ఏం చేయలేకపోయారని, అలాంటిది కేటీఆర్​ ఏం చేయగలరని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరిగితే.. కేసీఆర్ హయాంలో అవినీతి, అక్రమాలు లెక్కలేకుండా జరుగుతున్నాయని ఆరోపించారు. 

కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ సర్కార్​లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నోళ్లంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనన్నారు. మహారాష్ట్రలో చనిపోయిన రైతుల గురించి మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్రంలో చనిపోయిన రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.