తెలంగాణ ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు

తెలంగాణ ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు
  • కాంగ్రెస్ లో 51, బీఆర్ఎస్ లో 19, బీజేపీలో ఏడుగురిపై.. 

న్యూఢిల్లీ, వెలుగు :  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. వీరిలో 59 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది.

ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. 2018తో పొలిస్తే ఈసారి నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 8 శాతం పెరగ్గా, తీవ్రమైన కేసులున్న ఎమ్మెల్యేల సంఖ్య 12 శాతం పెరిగింది. ఒక ఎమ్మెల్యేపై మర్డర్ కేసు(ఐపీసీ –302), ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసు(ఐపీసీ – 307),  ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడి చేసిన కేసులు ఉన్నట్టు ఏడీఆర్ తెలిపింది.

పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ నుంచి 64 మంది గెల్వగా 51 మందిపై.. బీఆర్ఎస్ నుంచి 39 మంది గెల్వగా 19 మందిపై.. బీజేపి నుంచి 8 మంది గెల్వగా ఏడుగురిపై.. ఎంఐఎం నుంచి ఏడుగురు గెల్వగా నలుగురిపై.. సీపీఐ నుంచి ఉన్న ఒక్క ఎమ్మెల్యేపైనా క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. కాంగ్రెస్ లో 31 మందిపై, బీఆర్ఎస్ లో 17 మందిపై, బీజేపీలో ఏడుగురిపై, ఎంఐఎంలో ముగ్గురిపై, సీపీఐలో ఒక్కరిపై తీవ్రమైన కేసులు ఉన్నట్టు పేర్కొంది.

72 మంది గ్రాడ్యుయేట్స్ 

119 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి పాస్ అయ్యారని ఏడీఆర్ తెలిపింది. 72 మంది గ్రాడ్యుయేట్ ఆపై చదువులు చదివారు. ఐదుగురు డిప్లమా చేయగా, ఇద్దరు కేవలం అక్షరాస్యులు మాత్రమే. 25 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్నోళ్లు 23 మంది ఉండగా.. 96 మంది 51 నుంచి 80 ఏండ్ల మధ్య వయసున్నోళ్లు ఉన్నారు.

ఈసారి 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 26 ఏండ్లతో యంగెస్ట్ ఎమ్మెల్యేలుగా యశస్విని, మైనంపల్లి రోహిత్.. 74 ఏండ్ల ఓల్డేజ్ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు.