కరోనా బాధితులకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల భరోసా

కరోనా బాధితులకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల భరోసా

సేవా హీ సంఘటన్ ’ పేరుతో బీజేపీ సేవా కార్యక్రమాలు
‘కొవిడ్ కంటోరల్ రూం’ను ఏర్పాటు  చేసిన కాంగ్రెస్
సీపీఎం ఆధ్వర్యంలో హోం ఐసోలేషన్ సెంటర్
సీఐటీయూ, రైతు సంఘం,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్స్

హైదరాబాద్, వెలుగు: కరోనా బాధితులకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అండగా నిలుస్తున్నాయి. వారికి ట్రీట్​మెంట్​, మెడిసిన్స్​, భోజనం, అకామిడేషన్​ సదుపాయాలు   సమకూరుస్తున్నాయి. కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నాయి. ప్రత్యేకంగా కాల్​ సెంటర్లు, ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నాయి. బాధితుల  కష్టాల్లో పాలుపంచుకుంటున్నాయి. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం, సర్కారు హాస్పిటళ్లతో పాటు ప్రైవేట్​ హాస్పిటళ్లలోనూ బెడ్లు దొరకకపోవడం, సరైన సమాచారం అందకపోవడం, మెడిసిన్స్​ లభించకపోవడంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ముందుకొచ్చాయి. రోజూ వందలాది మందికి బెడ్లు, వ్యాక్సిన్, ప్లాస్మా, ఆక్సిజన్, టెస్టింగ్ సెంటర్లు, రెమ్డిసివిర్​ ఇంజెక్షన్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.  
బీజేపీ ఆధ్వర్యంలో.. 
‘సేవాహీ సంఘటన్’ పేరుతో గత 15 రోజులుగా రాష్ట్రంలో కరోనా బాధితులకు బీజేపీ  అండగా నిలుస్తోంది. పార్టీ  స్టేట్​ ఆఫీసులో 24 గంటల హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 3 వేల మందికి వివిధ రకాల సేవలను అందించారు. రోజుకు కనీసం 200 నుంచి 300 మంది బాధితులు బీజేపీ హెల్ప్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనో హర్ రెడ్డి కన్వీనర్ గా, మరో ముగ్గురు పార్టీ నేతలు సభ్యులుగా ‘సేవా హీ సంఘటన్’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అవసరమైన వారికి రెమ్డిసివిర్, ఆక్సిజన్​ను సమకూరుస్తున్నారు. అంబులెన్స్ అవసరం ఉన్నవారికి అరేంజ్ చేస్తున్నారు. బాధితులకు ప్లాస్మా,  బ్లడ్  కూడా సమకూరుస్తున్నారు. హాస్పిటళ్లలో బెడ్ల సమాచారాన్ని కూడా అందజేస్తున్నారు. ఐసోలేషన్ లో ఉండాలనుకునే వారికి పీర్జాదిగూడలోని ఆర్ఎస్ఎస్ ఆఫీసులో సేవా భారతి ఆధ్వర్యంలో వసతి కల్పిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 200 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. వారికి ఇమ్యూనిటీని ఇచ్చే ఫుడ్ కూడా అందజేస్తున్నారు. పార్టీ తరఫున డాక్టర్ల టీం ఆధ్వర్యంలో పేషెంట్లకు  టెలి మెడిసిన్, వీడియో మెడిసిన్  సేవలు కూడా అందిస్తున్నారు. ఐసోలేషన్ లో ఉంటూ ఆక్సిజన్ లెవల్స్ 94 కన్నా తక్కువకు పడిపోతే అలాంటి వారికి 5 నుంచి 6 లీటర్ల ఆక్సిజన్ కంటైనర్లను నేరుగా ఇంటికే పంపిస్తున్నారు.  ప్రతి రోజు సాయంత్రం బీజేపీ స్టేట్​ ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, సేవా హీ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ మనోహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ  ఆ రోజు పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమాలను, తర్వాత రోజు చేపట్టే కార్యక్రమాలను చర్చిస్తున్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు బాధితులకు పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ‘సేవా హీ సంఘటన్’ కన్వీనర్ మనోహర్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో కంట్రోల్​ రూం

కరోనా బాధితుల కోసం కాంగ్రెస్​పార్టీ గాంధీభవన్​లో కంట్రోల్​ రూంను ఏర్పాటు చేసింది. చాలా మంది ఫోన్లు చేసి సహాయం పొందుతున్నారు. రోజూ  70 నుంచి 80 రిక్వెస్టులు వస్తున్నాయని కంట్రోల్ రూమ్​బాధ్యుల్లో ఒకరైన సంగిశెట్టి జగదీశ్వరరావు  చెప్పారు. బెడ్స్, ఆక్సిజన్​ కోసం ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయని, రెమ్డిసివిర్ ఇంజెక్షన్, ప్లాస్మా, వ్యాక్సిన్​ కోసం కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారన్నారు. కొవిడ్​ పేషెంట్ల పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందని ఆయన చెప్పారు. యూత్​ కాంగ్రెస్​, స్టూడెంట్​కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలంతా ఒక నెట్​వర్క్​గా ఏర్పడి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వివరించారు. ‘‘బెడ్ల కోసం గవర్నమెంట్​ హాస్పిటళ్లకు ఫోన్​ చేస్తే లేవని చెప్తున్నరు. ప్రైవేటులో బెడ్లు చూస్తే పేషెంట్లకు ఆర్థికంగా భారం అవుతున్నది. ఇంటి దగ్గర ఆక్సిజన్​ సిలిండర్​ పెట్టుకుంటామంటే అవి దొరకడం లేదు. సిలిండర్​ ఉంటే రీఫిల్లింగ్​ అయితలేదు. రెమ్డిసివిర్​ ఇంజక్షన్​ బ్లాక్​లో దొరుకుతుంది తప్ప మేం హెల్త్​ అఫీషియల్స్​ను  అడిగితే ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. ఆన్​లైన్​లో ప్రొసీజర్​ ప్రకారం అడిగినా ఇస్తలేరు. మావంతుగా చేయగలినంత సహాయం చేస్తున్నం” అని  జగదీశ్వరరావు చెప్పారు. జిల్లాల్లో కూడా కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటు చేసి అక్కడ కూడా అయినకాడికి సహాయం చేస్తున్నట్లు కాంగ్రెస్​ నేతలు తెలిపారు. 
సీపీఎం ఆధ్వర్యంలో ఐసోలేషన్​
కరోనా పేషెంట్ల కోసం హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే)లో ఫ్రీ ఐసోలేషన్ సెంటర్​ను సీపీఎం  ఏర్పాటు చేసింది. నిన్నమొన్నటి వరకు సభలు, సమావేశాలకు వేదికైన ఈ కేంద్రంలో ముందుగా 20 బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. పేషెంట్లకు రోజూ అక్కడ వైద్యసేవలతో పాటు భోజన సదుపాయాలు, మందులను ఉచితంగా అందిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని మినీ హాల్​నూ కొన్ని బెడ్లతో ఐసోలేషన్​ సెంటర్​ను  త్వరలో ప్రారంభిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు  డీజీ నర్సింహారావు చెప్పారు. ఆదివారం కూకట్​పల్లి ప్రగతినగర్​లోని లీలా సుందరయ్య భవన్​లో హోం ఐసోలేషన్​సెంటర్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మరో నాలుగైదు జిల్లా కేంద్రాల్లోనూ హోం ఐసోలేషన్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. అన్ని జిల్లాల్లోని పార్టీ ఆఫీసులను కూడా అకమిడేషన్ సెంటర్లకు ఉపయోగిస్తామని చెప్పారు. కాగా హోం ఐసోలేషన్ సెంటర్ వివరాల కోసం 9490098580,  9490098058 సంప్రదించవచ్చని తెలిపారు.  ఐసోలేషన్​ సెంటర్​లో పేషెంట్లకు ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య టీ బిస్కెట్లు,  బ్రేక్ ఫాస్ట్ టీ ఇస్తున్నారు. ఉదయం 11  నుంచి 11.30 గంటల మధ్య  బటర్ మిల్క్, స్నాక్స్, మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 గంటల మధ్య లంచ్ అందజేస్తున్నారు. భోజనంలో రోజూ ఎగ్స్​ ఇస్తున్నారు.  వారంలో రెండురోజులు నాన్ వెజ్  పెడుతున్నారు.  సాయంత్రం 4 గంటలకు బటర్ మిల్క్, స్నాక్స్ , సాయంత్రం 6 గంటలకు టీ, రాత్రి 8 –9 గంటలకు డిన్నర్ అందజేస్తున్నారు. 
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హెల్ప్​లైన్ సెంటర్లు
సీఐటీయూతో పాటు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా హెల్ప్ లైన్ సెంటర్లను హైదరాబాద్​లోని వారి ఆఫీసుల్లో ప్రారంభించారు. 24 గంటల పాటు సమాచారం అందిస్తున్నారు. కొవిడ్ పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను డాక్టర్లతో మాట్లాడించడం, పరిస్థితిని బట్టి హోం ఐసోలేషన్​లో ఉండాలా? లేక హాస్పిటల్​లో ఉండాలా అనేది సూచిస్తున్నారు. పేదలైతే వారికి ఉచితంగానే కొవిడ్ కిట్ లోని టాబ్లెట్లను అందిస్తున్నామని, రోజువారీ కూలీలైతే వారికి అవసరమైన బియ్యం కూడా అందిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్  చెప్పారు. కరోనా పేషెంట్ల పరిస్థితి సీరియస్​గా ఉంటే హాస్పిటళ్లతో మాట్లాడి, కాస్త తక్కువ మొత్తానికే ట్రీట్​మెంట్​ అందించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. సీఐటీయూ స్టేట్​ ఆఫీస్​లో హెల్ప్​ లైన్ సెంటర్ 9490098328 ( శ్రీకాంత్), 9490098048 (కూరపాటి రమేష్ -), 9441210984  (పి.సుధాకర్ )ను సంప్రదించాలి. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీసులో హెల్ప్​లైన్ సెంటర్​9848929953 (పద్మ-), 9490098901 (ప్రసాద్), 9949725951 (శోభన్ నాయక్-)ను సంప్రదించవచ్చు.