చల్లటి వాతావరణంలో ఆస్తమా ఎటాక్​

చల్లటి వాతావరణంలో ఆస్తమా ఎటాక్​

వానాకాలం... జలుబు, జ్వరాలతో పాటు  ఆస్తమా ఊపిరాడనివ్వదు. ఛాతి  బిగబట్టి.. ఊపిరితిత్తుల్లోని గాలి గదుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎక్కువసేపు నడిచినా, ఏదైనా పని చేసినా సరిపడా శ్వాస అందదు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంది. చల్లటి వాతావరణం ఈ సమస్యల్ని మరింత పెంచుతుంది అంటున్నారు పల్మొనాలజిస్ట్​ డాక్టర్​ శైలజ. వానాకాలం ఆస్తమా తీవ్రతని అడ్డుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా ఎటాక్​కి కారణాలేంటి? ఇది ఎన్ని రకాలుగా మనల్ని ఎఫెక్ట్​ చేస్తుంది? అనే విషయాలు కూడా చెప్పారామె.

వాయునాళాల ద్వారా ఊపిరితిత్తులు ఆక్సిజన్​ని పీల్చుకొని, కార్బన్​–డై–ఆక్సైడ్​ని బయటకు పంపుతాయి. అయితే కొన్నిసార్లు ముక్కు, ఊపిరితిత్తులు లేదా శరీరంలోకి.. సరిపడని సూక్ష్మ పదార్థాలు(ఎల్లోజెన్స్​) గాలి లేదా ఆహారం ద్వారా వెళ్తాయి. వాటికి ప్రతిచర్యగా శరీరం వివిధ రకాల రసాయనాలను రిలీజ్​ చేస్తుంది. అలాగే కొన్నిసార్లు శ్వాసమార్గపు గోడలలో మృదువైన కండరాలు ఎక్కువ అవుతాయి. ఈ రెండింటి వల్ల వాయునాళాల లోపలి భాగంలో వాపు వస్తుంది. దానివల్ల వాయునాళాలు సున్నితంగా అయ్యి.. ఎలర్జీల బారిన పడతాయి. దాంతో దాని చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులకు ఆక్సిజన్​ సరఫరా తగ్గుతుంది. కార్బన్‌–డై–ఆక్సైడ్‌ బయటకు రావడం కష్టం అవుతుంది. అంటే వేగంగా గాలి పీల్చుకోవడం, వదలడం ఇబ్బందిగా మారుతుంది. ఇదే ఆస్తమా. దీని తీవ్రత ఎక్కువైతే పేషెంట్​ని వెంటనే హాస్పిటల్​కి తీసుకెళ్లాలి. 

కారణాలేంటి? 

ఆస్తమాకి దారితీసే ఎలర్జీలు రావడానికి చాలా కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డస్ట్​మైన్స్​. ఇది ఒక రకమైన సూక్ష్మజీవి. మన చర్మం నుంచి విడిపోయి రాలిన కణాలపై ఇది బతుకుతుంది. ఎక్కువగా పరుపులు, దిండ్లపై ఉంటాయి. అలాగే జన్యుపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితుల వల్ల ఆస్తమా వస్తుంది. తల్లిదండ్రులకు ఆస్తమా ఉంటే పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఉంది. జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, బూజు వంటివి ఎలర్జీలకి కారణమవుతాయి. ఆల్కహాల్, సిగరెట్​ తాగడం, కెమికల్స్​ ఎక్కువగా పీల్చడం వల్ల కూడా ఆస్తమా వస్తుంది. జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, ఏవైనా ట్యాబ్లెట్స్​ పడకపోవడం కూడా.. ఈ  డిసీజ్​కి దారితీస్తాయి. వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల కూడా ఆస్తమా తీవ్రత పెరుగుతుంది.   ఈ కారణాలని బట్టే ఆస్తమాని ఎలర్జిక్​, నాన్​ ఎలర్జిక్,  ఎర్లీ మార్నింగ్​, లేట్​ ఆన్​ సెట్​, ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్​ , స్టిరాయిడ్​ రెసిస్టెంట్​  ఆస్తమా అంటూ పేర్లు పెట్టారు. అలాగే కొందరిలో తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఆమ్లాలు​​ ఎక్కువగా విడుదలై కడుపులో, గొంతులో మంట వస్తుంటుంది. ఈ సమస్య కూడా ఆస్తమాకి కారణం అవ్వొచ్చు. 

లక్షణాలు.. ?

ఆస్తమా ఎటాక్​ అయితే.. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు శబ్దం వస్తుంటుంది. ఛాతి బరువుగా అనిపిస్తుంది. తెమడ దగ్గు ఇబ్బంది పెడుతుంది. ముక్కులు బిగుసుకుపోతాయి. శ్వాస తీసుకోవటం కష్టం అవుతుంది. కొందరిలో ఒంటిపై దద్దుర్లు , పగుళ్లు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అది కచ్చితంగా ఆస్తమానే అనుకోవడానికి లేదు. అవునో కాదో తెలుసుకోవడానికి స్పైరోమెట్రీ అనే టెస్ట్​ చేయించుకోవాలి. ఇందులో ఆస్తమా ఉన్నవాళ్లతో గాలి ఊదించి, ఎంత బలంగా ఊదగలుగుతున్నారన్న దాన్ని బట్టి వాయునాళాలు ఎలా ఉన్నాయో చెప్తారు. మరికొన్ని టెస్ట్​లు కూడా ఉన్నాయి. 

మన చేతుల్లోనే ఉంది

ఇన్‌హేలర్స్ సాయంతో ముడుచుకుపోయిన వాయునాళాలు రిలాక్స్ అయ్యేలా చేయొచ్చు. అలాగే ఆస్తమాతో బాధపడేవాళ్లు..  దుమ్ము, ధూళికి ఎక్కువగా ఎక్స్​పోజ్​ కాకూడదు. శరీరానికి పడని పదార్థాలు తినకూడదు. వీలైనంత వరకు చల్లటి వాతావరణంలో బయటికి వెళ్లకూడదు. ఆల్కహాల్​, సిగరెట్​తో పాటు జంతువులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. డస్ట్​మైన్స్​ రాకుండా దిండు కవర్లు, బెడ్​ షీట్​లని ప్రతివారం వేడినీళ్లతో ఉతకాలి. బాగా ఏడ్చినా లేదా నవ్వినా కొన్నిసార్లు ఆస్తమా తీవ్రత పెరగొచ్చు. అందుకే ఎమోషన్స్​ని బ్యాలెన్స్​డ్​​​గా ఉంచుకోవాలి. ఆస్తమా ఉన్నవాళ్లు ఎక్కువసేపు ఎక్సర్​సైజ్​లు చేయకూడదు. ఐస్​క్రీమ్స్​, కూల్​డ్రింక్స్​కి దూరంగా  ఉండాలి. టైంకి మందులు వాడాలి. పరిస్థితి చెయ్యి దాటితే వెంటనే డాక్టర్​ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి.

డాక్టర్​ కె. శైలజ, 

కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్​, 

కేర్​ హాస్పిటల్స్​, హైదరాబాద్​