- 44మంది మృతి.. 280 మంది మిస్సింగ్
- అపార్ట్మెంట్లలో చిక్కుకుపోయిన అనేక మంది
- నిర్మాణ పనుల కోసం కట్టిన వెదురు బొంగులు, నెల్లకు మంటలు అంటుకుని ప్రమాదం
- ఏడు బ్లాక్‌లకు వ్యాపించిన మంటలు
- మధ్యాహ్నం నుంచి రాత్రి అయినా.. అదుపులోకి రాని ఫైర్
హాంకాంగ్: హాంకాంగ్‌లో 31 అంతస్తుల హైరైజ్ టవర్స్ ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టవర్ల చుట్టూ నిర్మాణ పనుల కోసం కట్టిన వెదురు బొంగులు, నెట్ లకు అంటుకున్న మంటలు.. వరుసగా 7 బ్లాక్‌లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక ఫైర్ ఫైటర్ సహా 44 మంది సజీవ దహనం అయ్యారు. మరో 29 మందికి గాయాలు కాగా మరో 279 మంది మిస్సింగ్ అని అధికారులు తెలిపారు.దాదాపు 700 మందిని షెల్టర్లకు తరలించారు. అపార్ట్ మెంట్లలో ఇంకా అనేక మంది చిక్కుకున్నారని, కచ్చితంగా ఎంత మంది ఉంటారన్నది మాత్రం తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం హాంకాంగ్ శివార్లలోని టాయి పో జిల్లా వాంగ్ ఎఫ్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కాంప్లెక్స్ లో మొత్తం 8 బ్లాక్ లలో 2 వేల రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు ఉన్నాయి. మధ్యాహ్నం 2.45 గంటలకు ఓ బ్లాక్ వద్ద కట్టిన వెదురు బొంగులు, నెట్ లు అంటుకుని మంటలు చెలరేగాయి. బలమైన గాలులు వీస్తుండటంతో వరుసగా ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్ కు మంటలు వ్యాపించాయి.
అదుపులోకి రాని మంటలు..
ఫైర్ ఫైటర్లు పదులకొద్దీ ఫైర్ ఇంజన్లతో, క్రేన్ సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం మొదలైన మంటలు.. రాత్రి అయినా అదుపులోకి రాలేదు. హైరైజ్ టవర్లు అన్నీ మంటల్లో తగలబడుతూ, దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, హాంకాంగ్ లో హైరైజ్ బిల్డింగుల నిర్మాణాల్లో కూడా వెదురు బొంగులను విస్తృతంగా వాడుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రభుత్వ రంగ నిర్మాణాల్లో వీటిని వాడొద్దని స్థానిక ప్రభుత్వం భావిస్తోంది. కనీసం 50 శాతం అయినా మెటల్ ఫ్రేమ్స్ ను వినియోగించాలని, దశలవారీగా వెదురు బొంగుల వాడకాన్ని పూర్తిగా పక్కనపెట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది.
