హాంకాంగ్: హాంకాంగ్‌లోని వాంగ్ హాక్ కోర్ట్ టవర్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 65కు చేరుకున్నది. ఇంకా 250 మందికి పైగా ఆచూకీ దొరకడం లేదు. 80 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 45 మంది హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉంది. ఆరు దశాబ్దాల్లో ఇదే అతిపెద్ద అగ్ని ప్రమాదమని స్థానిక అధికారులు చెప్తున్నారు. కొన్ని గంటలపాటు అగ్నిమాపక శాఖ అధికారులు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు ప్రకటించారు. మొత్తం 8 టవర్లు ఉండగా.. అందులో 7 టవర్లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కో టవర్‌లో 31 ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం 1984 ఫ్లాట్లు ఉండగా.. దాదాపు 4,600 మంది నివాసం ఉంటున్నారు. టవర్లకు మరమ్మతులు చేస్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగింది. రెన్యువేషన్ కాంట్రాక్ట్ తీసుకున్న ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. టవర్ల మరమ్మతులకు ఉపయోగించిన సామగ్రి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెన్యువేషన్ చేసే టైమ్‌లో ఇంజనీర్లు సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని పోలీసులు చెప్తున్నారు.
నిమిషాల్లోనే ఏడు టవర్లకు మంటలు..
తొలుత ఒక టవర్‌లో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలోనే 6 టవర్లకు విస్తరించాయి. దీనికి ప్రధాన కారణం రెన్యువేషన్ పనుల్లో పాలి స్టైరో ఫోమ్ వాడకమేనని గుర్తించారు. ఈ టవర్లను 1984లో నిర్మించగా.. తాజాగా రెన్యువేషన్ చేస్తున్నారు. దీని కోసం పాలి స్టైరో ఫామ్‌తో తయారు చేసిన వస్తువులను ఉపయోగించారు. ఈ ఫోమ్ చాలా వేగంగా మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాని కారణంగానే మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.
