గాంధీ హిందువు.. గాడ్సే హిందుత్వవాది

గాంధీ హిందువు.. గాడ్సే హిందుత్వవాది

ఈ దేశం హిందువులదే కానీ హిందుత్వవాదులది కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హిందుత్వ వాదులకు అధికారం మాత్రమే కావాలని, అధికారం కోసం వారు ఏమైనా చేస్తారన్నారని ఆయన ఆరోపించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 2014 నుంచి అధికారంలో ఉన్న ఈ   హిందుత్వవాదులను గద్దె దించి, మళ్లీ హిందువులను అధికారంలోకి తెచ్చుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. అందరినీ గౌరవిస్తూ, ఎవరికీ భయపడకుండా, అన్ని మతాలను గౌరవించేవారే హిందువులని రాహుల్ స్పష్టం చేశారు.

నేను హిందువును.. హిందుత్వవాదిని కాదు

ప్రస్తుతం భారత దేశ రాజకీయాల్లో హిందూ, హిందుత్వవాది అన్న రెండు పదాల మధ్య పోటీ నడుస్తోందని, ఈ రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తాను హిందువునని, హిందుత్వవాదిని కాదని రాహుల్ చెప్పారు. మహాత్మా గాంధీ హిందువు అని, గాడ్సే హిందుత్వవాది అని ఆయన అన్నారు. హిందువు సత్యాగ్రహంపై ఆసక్తి చూపిస్తాడని, అంటే సత్యం కోసం శోధిస్తాడని, మహాత్మా గాంధీ చేసింది అదేనని రాహుల్ చెప్పారు. కానీ గాడ్సే ఆ మహాత్ముడి గుండెల్లో బుల్లెట్లు దించాడని, గాడ్సే హిందుత్వవాది  అని అన్నారు. హిందుత్వవాదులకు సత్యాగ్రహం అంటే పట్టదని, వాళ్లకు కేవలం అధికారమే కావాలని, దాని కోసం ఏం చేయడానికైనా వెనుకాడరని చెప్పారు. ఆ తర్వాత  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రచారం కోసం ఖర్చు చేసే డబ్బును రైతులకు ఇవ్వాలని సూచించారు. వంటగ్యాస్, వంటనూనెలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం ప్రియాంక గుర్తు చేశారు.