పరిగి, వెలుగు: ఏటీఎంలో మనీ విత్డ్రా చేయడం తెలియక సహాయం కోరిన ఓ వ్యక్తిని కేటుగాడు నిండా ముంచాడు. ఏటీఎం కార్డు మార్చేసి ఏకంగా రూ. 70 వేలు కాజేశాడు. వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన హరినాథ్ బుధవారం పరిగిలోని ఎస్బీఐ ఏటీఎంకు మనీ విత్ డ్రా చేయడానికి వచ్చాడు. మనీ డ్రా చేయడం తెలియక, అక్కడే ఉన్న మరో వ్యక్తిని సహాయం కోరాడు.
ఆ అపరిచిత వ్యక్తి హరినాథ్ దృష్టి మరల్చి, చాకచక్యంగా ఏటీఎం కార్డును మార్చేసి, పిన్ కోడ్ తెలుసుకున్నాడు. ఆపై నగదు రావడం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన హరినాథ్ బ్యాంకుకు వెళ్లి అకౌంట్ తనిఖీ చేయగా, తన ఖాతా నుంచి రూ. 70 వేలు విత్ డ్రా అయినట్లు, కేవలం రూ. 70 మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుసుకొని షాక్కు గురయ్యాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
