నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం కార్డులను మార్చి చోరీలు

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం కార్డులను మార్చి చోరీలు
  •     నిందితుడి అరెస్ట్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఏటీఎం సెంటర్ల వద్ద పైసలు డ్రా చేసుకునేందుకు వచ్చే వారిని ఏమార్చి వారి ఏటీఎం కార్డులను మార్చి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్పీ రాజేశ్ చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులో ఉన్న ఎస్​బీఐ ఏటీఎం సెంటర్​వద్దకు తిమ్మక్​పల్లి వాసి గుర్రాల శ్రీనివాస్​పైసలు డ్రా చేసుకొనేందుకు వెళ్లాడు. కార్డు వినియోగం తెలియక ఇబ్బంది పడుతుండగా ఇక్కడే ఉన్న భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గడ్డమీది రమేశ్తాను పైసలు డ్రా చేయడానికి సాయం చేస్తానని నమ్మబలికి ఏటీఎం పిన్​నంబర్ తెలుసుకున్నాడు. 

పైసలు రావట్లేదని శ్రీనివాస్​కు చెప్పి అతడిని ఏమార్చి వేరే కార్డు ఇచ్చాడు.  శ్రీనివాస్​అక్కడి నుంచి వెళ్లిన తర్వాత  ఇతడి కార్డుతో రూ.20 వేలు డ్రా చేశాడు. బాధితుడు తాను మోసపోయానని గ్రహించి టౌన్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. రమేశ్ ఏప్రిల్​28న జిల్లా కేంద్రంలో ఓ మహిళను బెదిరించి  ఏటీఎం కార్డు లాక్కొని రూ.37వేల నగదు డ్రా చేసుకున్నట్లు ఎంక్వైరీలో తేలిందన్నారు. అతడిపై ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 25 వరకు కేసులు ఉన్నట్లు చెప్పారు. నిందితుడి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి, సీసీఎస్​సీఐ రామన్​తదితరులు పాల్గొన్నారు.