దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కాన్వాయ్‌పై కాంగ్రెస్ లీడర్లు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి కారులో బయలుదేరారు. ఆయన వాహనాలు స్థానిక ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకోగానే.. అప్పటికే అక్కడ గుమిగూడిన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యేను వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొందరు కాంగ్రెస్ లీడర్లు కోడిగుడ్లను ఎమ్మెల్యే వాహనంపైకి విసిరారు. కార్ల నుంచి దిగిన బీఆర్‌ఎస్ లీడర్లు కాంగ్రెస్ నాయకుల వైపు దూసుకొచ్చారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.