పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం

పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం
  • కావాలనే మ్యూట్​లో పెట్టారని కాంగ్రెస్ నేతల ఆరోపణ
  • అది సాంకేతిక సమస్య వల్లేనని బీజేపీ వివరణ
  • ఐదోరోజు సమావేశాల్లోనూ అదే గందరగోళం  
  • ఉభయసభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మలి విడత సమావేశాల్లో వరుసగా ఐదో రోజూ అదే గందరగోళం నెలకొంది. అదానీ గ్రూప్ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్​ చేసింది. శుక్రవారం లోక్ సభ ప్రారంభం కాగానే ఆ పార్టీ ఎంపీలు వెల్​లోకి దూసుకెళ్లి స్పీకర్ దగ్గరగా వెళ్లి నినాదాలు ప్రారంభించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, అమెరికా, యూరప్ దేశాలు జోక్యం చేసుకోవాలంటూ ఇటీవల లండన్​లో కామెంట్లు చేసిన రాహుల్ క్షమాపణలు చెప్పిన తర్వాతే మాట్లాడాలంటూ అధికార బీజేపీ ఎంపీలు కూడా లేచి నిలబడి పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసే సంసద్ టీవీలో 20 నిమిషాల పాటు ఎలాంటి ఆడియో లేకుండానే విజువల్స్ ప్రసారమయ్యాయి. చివరకు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతున్నప్పుడు ఆడియో తిరిగి ప్రారంభమైంది. ప్రొసీడింగ్స్ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని ఆయన కోరినా ఆందోళనలు కొనసాగాయి. దీంతో ఐదో రోజు కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ జరగకుండానే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. అయితే, ప్రభుత్వం కావాలనే లోక్ సభ ప్రసారాలను మ్యూట్ చేసిందంటూ కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోడీ ఫ్రెండ్ కోసం లోక్ సభనే మ్యూట్ లో పెట్టారంటూ ఆరోపించింది. అయితే, టెక్నికల్ సమస్య వల్లే ప్రసారాలు మ్యూట్ అయ్యాయని బీజేపీ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ప్రతిరోజూ లోక్ సభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, ఆందోళనలు యథాతథంగా ప్రసారం అయ్యాయని, ఈ ఒక్కరోజు మ్యూట్ లో పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

మోడీపై సభా హక్కుల నోటీసు

పోయిన నెలలో బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాల సందర్భంగా రాజ్యసభలో గాంధీ కుటుంబాన్ని అవమానించేలా ప్రధాని మోడీ కామెంట్లు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ రాజ్యసభ చైర్మన్ జగ్​దీప్ ధన్​కర్​కు శుక్రవారం ప్రివిలీజ్ నోటీస్ ఇచ్చారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అంత గొప్పవారైతే.. సోనియా, రాహుల్, ఇతర గాంధీ ఫ్యామిలీ మెంబర్లు నెహ్రూ ఇంటి పేరును ఎందుకు వాడుకోవట్లేదని మోడీ కామెంట్ చేయడం వారిని అవమానించడమేనని  వేణుగోపాల్ ఆరోపించారు. కూతుళ్లు తండ్రి ఇంటిపేరును పెట్టుకోరని, భర్త ఇంటి పేరునే పెట్టుకుంటారని తెలిసినా.. మోడీ వారిని అవమానించాలన్న ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేశారన్నారు. మోడీకి వ్యతిరేకంగా ప్రివిలీజ్ ప్రొసీడింగ్స్ చేపట్టాలని కోరారు.  

రాహుల్ బహిష్కరణకు బీజేపీ పావులు? 

విదేశీ గడ్డపై దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశాడన్న కారణంతో రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి బహిష్కరించే దిశగా బీజేపీ పావులు కదిపే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాహుల్​ను సభ నుంచి బహిష్కరించే అంశంపై స్పెషల్ పార్లమెంటరీ కమిటీ తో విచారణ చేయించాలంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. కేంబ్రిడ్జి వర్సిటీలో రాహుల్ చేసిన కామెంట్లు పార్లమెంట్​ ధిక్కార మేనని తెలిపారు. యూపీఏ  ప్రభుత్వం లో నోటుకు ఓటు స్కాంపై ఇలాగే కమిటీతో విచారణ జరిపించి 11 మంది ఎంపీలను బహిష్కరించారు. ఇప్పుడు ఇలాంటి కమిటీ వేసి రాహుల్​ను బహిష్కరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

సారీ చెప్పేదాకా మాట్లాడనియ్యం: బీజేపీ 

దేశ అంతర్గత వ్యవహారాలపై విదేశాలను జోక్యం చేసుకోవాలన్న రాహుల్ గాంధీ ముందు దేశానికి క్షమాపణలు చెప్పిన తర్వాతే పార్లమెంట్​లో అడుగుపెట్టాలని బీజేపీ స్పష్టం చేసింది. దేశానికి క్షమాపణలు చెప్పేదాకా ఆయనను సభలో మాట్లాడనివ్వబోమ ని తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి, కుటుంబం ఇగో..  పార్లమెంట్ కంటే ఎక్కువని అనుకోవడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. దేశానికి సారీ చెప్పాకే రాహుల్ సభలోకి రావాలని డిమాండ్ చేశారు. గురువారం రాహుల్ సభలో మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు తాను ఒక ఎంపీని అయ్యానంటూ చేసిన కామెంట్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. పార్లమెంట్ ప్రతిష్టను కూడా ఆయన దిగజారుస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ యాంటీ ఇండియా శక్తుల భాష మాట్లాడుతున్నారని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు విమర్శించారు.