IPL 2025: లక్నోతో మ్యాచ్‌కు రెడీ.. RCB జట్టులో చేరిన స్టార్ పేసర్

IPL 2025: లక్నోతో మ్యాచ్‌కు రెడీ.. RCB జట్టులో చేరిన స్టార్ పేసర్

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పండగ లాంటి వార్త అందింది. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఆదివారం (మే 25) బెంగళూరు జట్టులో చేరాడు. మంగళవారం (మే 27) లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరిన ఆర్సీబీ టాప్-2 లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. ఈ కీలక మ్యాచ్ కు హాజిల్‌వుడ్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఆసీస్ పేసర్ లేకపోవడం బెంగళూరు జట్టుకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం (మే 23) సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది.   

హాజిల్‌వుడ్ స్థానంలో వచ్చిన సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన హాజిల్‌వుడ్ ఇక రావడం కష్టమే అనుకున్నారు. అయితే ఆర్సీబీ జట్టు కోసం తన మనసు మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఉన్న జోష్.. ప్లే ఆఫ్స్ కు అందుబాటులో ఉండనున్నాడు. అనుకున్నట్టుగానే మే 25న జట్టులో చేరాడు. 

ALSO READ | IPL 2025: ఏం కొట్టుడు కొడుతున్నారు భయ్యా: రికార్డు సృష్టించిన ఐపీఎల్‌-2025 సీజన్‌

ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున బెస్ట్ బౌలర్ గా నిలిచిన ఈ ఆసీస్ పేసర్.. భుజం గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్ లు ఆడలేదు. ఆ తర్వాత బ్రిస్బేన్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ  పొంది పూర్తి ఫిట్ నెస్ సాధించి ప్రాక్టీస్ ప్రారంభించాడు. గత సంవత్సరం మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోష్ హాజిల్‌వుడ్ ను రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి తనపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.  

ఈ సీజన్ లో ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా.. టాప్ 2 పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆర్సీబీ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన పటిదార్ సేన మిగిలిన మ్యాచ్ గెలిస్తే టాప్ 2 లో ఉండే అవకాశం ఉంది.   అప్పుడు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. మంగళవారం (మే 27) లక్నో సూపర్ జయింట్స్‎తో ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.