- బార్టీ పట్టేసింది
- ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన యాష్లే
- 44 ఏళ్ల తర్వాత మెగా టోర్నీ గెలిచిన ఆసీస్ విమెన్‌గా రికార్డు
- ఫైనల్లో పోరాడి ఓడిన కొలిన్స్
ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్స్ గెలిచింది. వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సైతం అందుకుంది. కానీ, సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ మాత్రం లోకల్ స్టార్ యాష్లే బార్టీకి అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటిదాకా ఎనిమిదిసార్లు ప్రయత్నించినా కనీసం ఫైనల్ కూడా చేరుకోలేకపోయింది. తనే కాదు 44 ఏళ్లుగా మరే ఆసీస్ విమెన్ ప్లేయర్ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గ్రాండ్‌స్లామ్ అందుకోలేకపోయారు. కానీ, ఇన్నేళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. సెన్సేషనల్ పెర్ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌కు మస్తు కిక్ ఇస్తూ బార్టీ అనుకున్నది సాధించింది..! టైటిల్ ఫైట్‌లో ఖతర్నాక్ ఆటతో విమెన్స్ సింగిల్స్ టైటిల్ పట్టేసింది! హోమ్‌గ్రౌండ్‌లో గ్రాండ్‌సలామ్ అనిపించుకుంది..!
మెల్‌బోర్న్: వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ యాష్లే బార్టీ అద్భుతం చేసింది. సెకండ్ సెట్‌లో 1–5తో వెనుకబడ్డా సూపర్‌గా కమ్‌బ్యాక్ చేసిన బార్టీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ బార్టీ 6–3, 7–6 (7/2)తో 27వ సీడ్ డానియెల్ కొలిన్స్ (అమెరికా)పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తద్వారా 44 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఆస్ట్రేలియా విమెన్‌గా రికార్డుకెక్కింది. 1978లో క్రిస్ ఒనిల్ ఫస్ట్ టైమ్ ఈ ఘనత సాధించగా, ఇప్పుడు బార్టీ అందుకుంది. యాష్లే ఖాతాలో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. లాస్ట్ ఇయర్ గ్రాస్ కోర్టులో వింబుల్డన్ నెగ్గిన, ఆమె 2019లో క్లే కోర్టులో ఫ్రెంచ్ ఓపెన్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు హార్డ్‌కోర్టు అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా కైవసం చేసుకుంది. యూఎస్ ఓపెన్ కూడా గెలిస్తే కెరీర్ స్లామ్ కంప్లీట్ చేసుకోనుంది. మరోవైపు కెరీర్‌లో ఫస్ట్ గ్రాండ్‌స్లామ్ కోసం కొలిన్స్ కూడా చాలా కష్టపడినా బార్టీ స్పీడును అందుకోలేకపోయింది. తన ఫైటింగ్ స్పిరిట్‌తో అందరి మనసులు గెలిచింది. ఫైనల్లో బార్టీ ఏకంగా పది ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టగా, కొలిన్స్ ఒక్క ఏస్, 17 విన్నర్లకే పరిమితం అయింది. మూడు డబుల్ ఫాల్ట్స్ చేసిన బార్టీ 3 బ్రేక్ పాయింట్స్ గెలవగా, రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కొలిన్స్ రెండు బ్రేక్ పాయింట్స్ గెలిచింది.
సూపర్ ఫైట్
సొంతగడ్డపై టోర్నీలో ఫైనల్ చేరే క్రమంలో బార్టీ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క సర్వీస్ గేమ్ మాత్రమే కాపాడుకోలేకపోయింది. ఇదే స్పీడు, జోష్‌ను బార్టీ టైటిల్ ఫైట్‌లోనూ కొనసాగించింది. పవర్‌ఫుల్ సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్ విన్నర్లతో పాటు నెట్ గేమ్‌లో అధిపత్యం చెలాయిస్తూ ఫస్ట్ సెట్‌లో కొలిన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఐదో గేమ్‌లో బ్రేక్ పాయింట్ కాపాడుకున్న బార్టీఆరో గేమ్‌లో కొలిన్స్ సర్వీస్ బ్రేక్ చేసి 4–2తో లీడ్ సాధించింది. ఆపై, తాను సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌లో ఓ ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో పాటు ఏస్‌తో సెట్‌ను ఈజీగా గెలిచింది. కానీ, కొలిన్స్ వెంటనే కోలుకుంది. సెకండ్ సెట్ రెండో గేమ్‌లోనే బార్టీ సర్వీస్ బ్రేక్ చేసింది. ఆపై, హోరాహోరీగా నడిచిన తర్వాతి గేమ్‌లో బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో సర్వ్ నిలబెట్టుకుంది. మరో వైపు ప్రెజర్‌లో మిస్టేక్స్ కొనసాగించిన యాష్లే ఆరో గేమ్‌లో రెండు డబుల్ ఫాల్ట్స్ చేసి సర్వీస్ కోల్పోయింది. దాంతో, కొలిన్స్ 5–1తో లీడ్‌లోకి వచ్చింది. రెండు సార్లు సెట్ పాయింట్ కోసం సర్వ్ చేసిన ఆమె మ్యాచ్‌ను థర్డ్ సెట్‌కు తీసుకెళ్లి ఫస్ట్ గ్రాండ్‌స్లామ్ గెలిచేలా కనిపించింది. కానీ, బార్టీ ఆమెకు ఆ చాన్స్ ఇవ్వలేదు. కొవిడ్ రిస్ట్రిక్షన్స్‌లోనూ స్టేడియం మొత్తం నిండిన ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తుండగా.. బార్టీ తనలోని బెస్ట్ ఆటను బయటకు తీసింది. తర్వాతి ఆరు గేమ్స్‌లో ఐదింటిలో నెగ్గి మ్యాచ్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లింది. టై బ్రేక్‌లో కొలిన్స్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ తప్పిదాలతో వరుసగా రెండు పాయింట్లు కోల్పోగా.. బార్టీ రెండు ఫోర్‌హ్యాండ్ విన్నర్లు కొట్టి 4–0తో లీడ్‌లోకి వచ్చింది. తర్వాత రెండు పాయింట్లు కోల్పోయినా మరో ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేసిన బార్టీ గట్టిగా అరుస్తూ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంది.
‘నా కల నిజమైంది.
నా కల నిజమైంది. ఓ ఆస్ట్రేలియన్‌గా ట్రోఫీతో ఇక్కడ నిల్చున్నందుకు చాలా గర్వపడుతున్నా. ఈ జర్నీలో కోచ్, సపోర్ట్ స్టాఫ్, ఫ్యామిలీ నాకు చాలా హెల్ప్ చేశారు. మొదటి నుంచి వాళ్లు నాపై నమ్మకం ఉంచారు. మీ అందరి నుంచి ఇంత ప్రేమ లభించడం నా అదృష్టం. నాకు సపోర్ట్ చేసిన ఇక్కడి ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. వాళ్లు నన్ను రిలాక్స్ చేయడంతో పాటు నా బెస్ట్ టెన్నిస్ ఆడేలా ఫోర్స్ చేశారు. ఇప్పటిదాకా నేను ఆడిన మ్యాచ్‌ల్లో ఇంత సరదాగా కనిపించిన ఫ్యాన్స్ వీళ్లే. నా అపోనెంట్ కొలిన్స్ కూడా చాలా బాగా ఆడింది. ఆమె టాప్10లో ఉండాల్సిన ప్లేయర్.
‑ యాష్లే బార్టీ

