కొత్తగూడెంలో నిరు పేదలకు పట్టాలిచ్చిన్రు..హద్దులు మరిచిన్రు

కొత్తగూడెంలో నిరు పేదలకు పట్టాలిచ్చిన్రు..హద్దులు మరిచిన్రు
  • కొత్తగూడెం పట్టణంలో నిరుపేదలకు ఒక్కొక్కరికీ 75 గజాల చొప్పున ఇండ్ల స్థలం కేటాయింపు 
  • 1,891 మంది నుంచి దరఖాస్తుల వస్తే 800 మంది సెలక్ట్​
  •  ఆర్నెళ్ల కింద పట్టాల పంపిణీ.. ఆపై పట్టించుకోని ఆఫీసర్లు 
  • ఎదురుచూపుల్లో లబ్ధిదారులు.. క్యాన్సిల్​ అవుతాయనే ప్రచారంతో ఆందోళన 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం పట్టణంలో అర్హులైన నిరు పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని గత ప్రభుత్వ హయాంలో అధికారులు పట్టాలిచ్చి ఇప్పటి వరకు హద్దులు చూపలేదు. ఆర్నెళ్లల్లో ఇండ్లు కట్టుకోకపోతే ఆ పట్టాలు క్యాన్సిల్​ అవుతాయనే ప్రచారంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగూడెంలో ఆర్నెళ్ల కింద నిరుపేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్​తో పాటు తహసీల్దార్, అప్పటి ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.

దీంతో 1,891 మంది ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 800 మంది వరకు లబ్ధిదారులను గుర్తించారు. పాత కొత్తగూడెంలోని డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల దగ్గర స్థలాలు ఇస్తామని చెప్పారు.  వీరికి గతేడాది సెప్టెంబర్​ 25న అప్పటి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్​ పర్సన్​ కే. సీతాలక్ష్మి, తహసీల్దార్​, మున్సిపల్​ కమిషనర్​ సమక్షంలో ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కొద్ది రోజుల్లోనే వారికి హద్దులు చూపిస్తామని చెప్పారు. గృహలక్ష్మి స్కీం వచ్చేలా చూస్తామన్నారు.

రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్​స్తంభాలు, పార్క్​లతో అద్భుతమై కాలనీ నిర్మిస్తామని గొప్పలు చెప్పడంతో లబ్ధిదారులు ఎగిరి గంతేశారు. కానీ నెలలు గడుస్తున్నా హద్దులు చూపకపోవడంతో వారిలో ఆందోళన పెరుగుతోంది. పేదలకు ఇచ్చిన ల్యాండ్​కు సమీపంలోనే ప్రభుత్వ స్థలాన్ని కొందరు బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు ఆక్రమించుకునేందుకు యత్నించిన దాఖలాలున్నాయి.

ఆ స్థలాన్ని ఎప్పుడు.. ఎవరు కాజేస్తారోనని భయపడుతున్నారు.  మరో వైపు తమకు పొజిషన్​ సర్టిఫికెట్​ ఇచ్చిన టైంలో ఆర్నెళ్ల లోపు ఇండ్లు కట్టుకోకపోతే స్థలాలను తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని ఆఫీసర్లు చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసర్ల నిర్లక్ష్యంతోనే ఇప్పటి వరకు హద్దులు చూపలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్​ ప్రియాంక అల స్పందించి తమకిచ్చిన పొజిషన్​ పట్టా ప్రకారం హద్దులు చూపించాలని కోరుతున్నారు. 

హద్దులు చూపిస్తాం.. 

లబ్ధిదారులకు ఇచ్చిన ల్యాండ్​ను మూడు బిట్లుగా చేశాం. ఒక బిట్​లో హద్దులు వేశాం. మిగతా బిట్లలో హద్దులు గుర్తించాల్సి ఉంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. త్వరలోనే  హద్దులు చూపిస్తాం. 
- పుల్లయ్య, తహసీల్దార్, కొత్తగూడెం