హిమాచల్లో హిమపాతం.. 260కి పైగా రోడ్ల మూసివేత

హిమాచల్లో హిమపాతం.. 260కి పైగా రోడ్ల మూసివేత

హిమపాతంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు 

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం భారీగా హిమపాతం సంభవించడంతో 260కి పైగా రోడ్లను మూసివేశారు. నాలుగు జాతీయ రహదారులను బంద్ చేశారు. మద్యధరా ప్రాంతంలో ఏర్పడిన తుపానుల ప్రభావంతో గత 24 గంటల్లో రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ లోని రోహతంగ్ పాస్ లో గత 24 గంటల్లో 135 సెంమీల హిమపాతం కురిసింది. ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో కురిసిన హిమపాతం ఇదే. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. చంబా 67మీమీ, కుఫ్రీ 57మీమీ వర్షంతో అత్యంత తేమగా ఉంది. మంగళవారం ఉదయం హమీర్ పూర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుములతో కూడిన వర్షం కురిసింది. రాష్ట్రంలో 661 ట్రాన్స్ ఫార్మర్లు, 33 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది. సిస్సు, సొలాంగ్, అటల్ టన్నెల్, రోహతంగ్ లో భారీగా మంచు కురిసింది. దీంతో మనాలీ వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి. 

రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

జైసల్మీర్ తో సహా రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. జైసల్మీర్ లో 39మీమీల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. సికార్ లో 10మీమీల వర్షపాతం రికార్డయింది.  జోద్ పూర్, అజ్మీర్, జైపూర్, భరత్ పూర్ డివిజన్లలో తేలికపాటి వర్షం పడింది. అయితే, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురవలేదు. ఫలితంగా రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనుంది. మంగళవారం చిరులో 6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ఇతర ప్రాంతాల్లో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది.