జై శ్రీరాం.. వైభవంగా ప్రతిష్ఠాపన మహోత్సవం

జై శ్రీరాం.. వైభవంగా ప్రతిష్ఠాపన మహోత్సవం
  • శాస్త్రోక్తంగా వేదపండితుల క్రతువులు
  • ఛత్రం, పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రధాని మోదీ
  • జై శ్రీరా నినాదాలతో మార్మోగిన అయోధ్య
  • దేశమంతా పండుగ వాతావరణం
  • ఊరూరా వేడుకలు.. అన్నదానాలు
  •  గ్రామాల్లోనూ ఎల్ ఈడీ స్క్రీన్లపై లైవ్ 

అయోధ్య: ఐదు శతాబ్దాల కల నెరవేరింది. జై శ్రీరాం నినాదం మిన్నంటింది. ఊరూరా పండుగ వాతావరణం నెలకొంది. విజయధ్వజాలు రెపరెపలాడాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ప్రధాని మోదీ స్వయంగా వెండి ఛత్రం, పట్టు వస్త్రాలు తీసుకొని గర్భాలయానికి చేరుకున్నారు. ప్రధాని తోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోపాటు పూజారులు మాత్రమే గర్భాలయంలో ఉన్నారు.  రాముని విగ్రహం కళ్లకు కట్టిన పసుపు వస్త్రాన్ని తొలగించగా.. మోదీతో సంకల్ప పూజ చేయించారు పండితులు. కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తుండగా సోమవారం మధ్యాహ్నం 1 2.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో బాల రాముడిని ప్రతిష్టాపన చేశారు.  అనంతరం శ్రీరాముని విగ్రహం వద్ద పూలు ఉంచి.. నమస్కరించారు.  ప్రాణప్రతిష్ట సమయంలో దేవాలయం మీద హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. పూజల అనంతరం విగ్రహానికి హారతులు పట్టారు మోదీ. ప్రాణప్రతిష్ఠ క్రతువులన్నీ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగడం విశేషం. సినీ, రాజకీయ, క్రీడలతో  పాటు వివిధ రంగాల ప్రముఖులు, సాధు సంతుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఐదు వందల  ఏండ్ల కల 

మోఘల్ వంశానికి చెందిన బాబర్.. రాముడి జన్మ స్థలాన్ని కూల్చేసి.. అక్కడ బాబ్రీ మసీదు నిర్మించాడని వివాదం 500 ఏళ్లుగా ఉంది. అప్పటి నుంచి హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు.. తిరిగి రామ జన్మభూమిని దక్కించుకోవటం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాయి. కరసేవ ద్వారా బాబ్రీ మసీదు కూల్చివేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామ మందిర నిర్మాణం జరిగింది. తన పురిటి గడ్డపై జగదానందన కారకుడు జానకీ ప్రాణనాయకుడు శ్రీరాముడు కొలువుదీరాడు. భారతావని పులకరించింది. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని గ్రామాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని మరీ వీక్షించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అన్నదాన కార్యక్రమాలతో పల్లె, పట్టణం సందడిగా మారింది.