 
                                    తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2025, అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. అజారుద్దీన్ భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌ను ముగించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో యూపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్‌పై పోటీ చేశారు.
సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ని తెలంగాణ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ సర్కార్ తీసుకుంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో.. మైనారిటీలకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు లభించింది.
క్రికెటర్ నుంచి పొలిటీషియన్‌గా..
62 ఏండ్ల అజారుద్దీన్ మాజీ క్రికెటర్ గా, టీమిండియా మాజీ కెప్టెన్ గా సుపరిచితులు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన.. 2009 లో కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లో రాజస్థాన్ నుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అదృష్టం వరించలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ పనిచేశారు.

 
         
                     
                     
                    