ఢిల్లీ వీధుల్లో.. మెడిసిన్ బాబా

ఢిల్లీ వీధుల్లో.. మెడిసిన్ బాబా

పేదలకు ఉచితంగా పంపిణీ
85 ఏళ్ల వయసులోనూ సమాజానికి సేవ

న్యూఢిల్లీ, వెలుగు : కొందరు తమ కోసం బతుకుతారు. మరికొందరు సమాజం కోసం జీవిస్తారు. రెండో కోవకు చెందిన వ్యక్తే ఈ మెడిసిన్ బాబా. ఈయన అసలు పేరు ఓంకార్ నాథ్ శర్మ. ఢిల్లీలోని వెస్ట్ ఉత్తమ్ నగర్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. 85 ఏండ్ల వయసు. వృద్ధాప్యం సహకరించపోయినా.. అంగవైకల్యం అడ్డుపడుతున్నా.. సొసైటీకి ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనది. ఆ తపనే ఆయనను గరీబోళ్ల ఇంట ‘ఓ మందు’గా మార్చింది. ‘ఆప్ భీ కిసీకా జీవన్ బచ్ సక్ తా హై(మీరు కూడా మరోకరి ప్రాణాల్ని కాపాడవచ్చు) అంటున్న మెడిసిన్ బాబాపై 'వీ6 వెలుగు' స్పెషల్ స్టోరీ. 

మెడిసిన్ బాబాగా ఎలా మారాడు ?
సరిగ్గా 14 ఏండ్ల క్రితం ఈస్ట్ ఢిల్లీలోని వికాస్ మార్గ్ లక్ష్మీనగర్ లో నిర్మాణంలో ఉన్న మెట్రో ఫ్లై ఓవర్ కూలింది. ఈ ఘటనలో కొందరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు.  బాధితులకు  ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు మందులు అందుబాటులో లేవని చెప్పారు. మందుల కోసం ఆ కూలీలు పడ్డ గోసను ఓంకార్ నాథ్ దగ్గరి నుంచి చూశాడు.  ఖరీదైన మందులు కొనలేక ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారని ఆందోళన చెందారు. వారికోసం ఏదైనా సహాయం చేయాలనుకున్నారు.  ప్రతిరోజు ఉదయం ఒక్కో ఏరియాలో తిరుగుతూ... ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న మందులు ఇవ్వాలని ప్రజలను  కోరారు. అదిగో అప్పటి నుంచి ఎన్నో రకాల మందులు సేకరించి.. అవసరమున్న పేదలకు ఉచితంగా అందజేస్తున్నారు.    అలా  బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఓంకార్ నుంచి మెడిసిన్ బాబా అవతరించాడు.

నేను కాదు.. దాతలే గొప్పవాళ్లు
ఇంట్లో ఎవరికైనా జ్వరమో, జబ్బో వస్తే... మందులు తెచ్చుకుంటారు. రోగం నయం అయ్యాక చాలా ట్యాబ్ లెట్స్, టానిక్స్ మిగిలిపోతాయి. అవి నాకు ఇవ్వండి, పేద ప్రజలకు అందిస్తాను అని ప్రతి ఇంటి ముందు మెడిసిన్ బాబా ప్రచారం చేస్తున్నారు. అన్నదానం, విద్యాదానం కంటే ఔషధ దానం మిన్న అంటారు.  ప్రజల్లో అవగాహన కల్పిస్తూ..  సేకరించిన మందులను, ఇంటికి చేరగానే తన కొడుకుతో కలిసి వేరు చేస్తారు. కాలం చెల్లిన మెడిసిన్, డేట్ సరిగా లేని ట్యాబ్ లెట్ల స్ట్రిప్స్ ను పక్కన పడేస్తారు. మిగిలినవి పేదలకు పంచుతారు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడడం సంతోషంగా ఉందని చెప్తారు.

డాక్టర్ చీటీ ఉండాల్సిందే
మెడిసిన్ బాబా ఇంట్లో తలనొప్పికి సంబంధించి రూపాయి గోలీ నుంచి లివర్ క్యాన్సర్ కు వాడే రూ. 20 వేల ట్యాబ్ లెట్స్ వరకు అన్నీ ఉచితంగా దొరుకుతాయి. సుదూర ప్రాంతాల నుంచి పేదలు ఈయన దగ్గర మందుల కోసం వస్తారు. ట్యాబ్ లెట్స్ కావాలంటే డాక్టర్ రాసిచ్చిన చీటీ ఉండాల్సిందే. అలాగే.. కొంత డబ్బును డిపాజిట్ గా పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్, వీల్ చైర్, హాస్పిటల్ బెడ్ ను కూడా ఉచితంగా అందిస్తున్నాడు.  9250243298,  9318400189లతో మెడిసిన్ బాబాను సంప్రదించవచ్చు. 

స్పూర్తిగా నిలుస్తున్నారు
14 ఏండ్ల కింద తానొక్కడే ముందడుగు వేశాడు.  ఇప్పుడు ఎంతో మంది.. ఆయనకు సాయం చేస్తున్నారు. మెడిసిన్ బాబా వెంట వెళ్తూ మందులు సేకరిస్తున్నారు. వయసు సహకరించని ఆయనకు తోడుగా నిలుస్తున్నారు. మరోవైపు ఆయన చేస్తోన్న సేవకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగారు. సినీ హీరోలు, స్వచ్చంద సంస్థ వాళ్లు మెమోంటోలతో సత్కరిస్తున్నారు. తనకు కావాల్సింది మెమోంటోలు కాదని... మీరుండే ఏరియాల్లోని పేదలకు ఉచితంగా మందులు అందించాలని ఆయన కోరుతున్నారు.