బాచుపల్లిలోని 3.09 ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించాలి.. హైకోర్టు ఆదేశం

బాచుపల్లిలోని 3.09 ఎకరాలను  నిషేధ జాబితా నుంచి తొలగించాలి.. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌‌ 83లో గల 3.09 ఎకరాల భూమిని ల్యాండ్​ సీలింగ్​ కింద పరిగణించడం సరికాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్‌‌ 22ఏ కింద ఉన్న నిషేధిత (ప్రొహిబిటరీ) జాబితా నుంచి తొలగించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. 

గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఈ మేరకు సవరించింది. జస్టిస్‌‌ ఎన్‌‌వీ శ్రవణ్‌‌కుమార్‌‌ ఈ ఉత్తర్వులు వెలువరించారు. చట్టంలోని సెక్షన్‌‌ 22(4) ప్రకారం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకునే హక్కు పిటిషనర్‌‌కు ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం, దరఖాస్తు అందిన మూడు నెలల్లోగా చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 

బాచుపల్లి భూములకు సంబంధించి భూ సంస్కరణల ట్రిబ్యునల్‌‌ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ కె. అర్జున్‌‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌పై గత ఏడాది ఏప్రిల్‌‌లో విచారణ జరిపిన న్యాయస్థానం.. వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని ఆదేశించింది. 

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మ్యుటేషన్లు, యాజమాన్య మార్పులు చేపట్టవద్దని అధికారులకు స్పష్టం చేసింది. కాగా, ఆ మధ్యంతర ఉత్తర్వుల వల్ల తమ హక్కులు ప్రభావితమవుతున్నాయని పేర్కొంటూ ఏ. ఈశ్వర్‌‌ ఇంప్లీడ్ పిటిషనర్‌‌గా మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు. సర్వే నంబర్‌‌ 83లో మొత్తం 17.30 ఎకరాల భూమిలో తనకు చెందిన 3.09 ఎకరాలు భూ సీలింగ్‌‌తో  సంబంధం లేనివని, వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. 

విచారణ సందర్భంగా రిట్‌‌ పిటిషనర్‌‌, ప్రతివాదుల తరఫు సీనియర్‌‌ న్యాయవాదులు కూడా ఆ 3.09 ఎకరాల భూమికి అసలు రిట్‌‌ పిటిషన్‌‌తో సంబంధం లేదని కోర్టుకు తెలియజేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించి, సంబంధిత 3.09 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.