మళ్లీ టెస్ట్‌‌ మోడ్‌‌లోకి.. ఇవాళ్టి (అక్టోబర్ 02) నుంచి వెస్టిండీస్‌‌తో ఇండియా తొలి టెస్ట్‌‌

మళ్లీ టెస్ట్‌‌ మోడ్‌‌లోకి.. ఇవాళ్టి (అక్టోబర్ 02) నుంచి వెస్టిండీస్‌‌తో ఇండియా తొలి టెస్ట్‌‌
  • ఫేవరెట్‌‌గా శుభ్‌‌మన్ గిల్ సేన
  • ఉ. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌, హాట్‌‌స్టార్‌‌‌‌లో

అహ్మదాబాద్: వివాదాల మధ్య ముగిసిన ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా  తక్కువ వ్యవధిలోనే మరో సవాల్‌‌కు సిద్ధమైంది. టీ20 ఫార్మాట్ నుంచి వెంటనే టెస్టు మోడ్‌‌లోకి వచ్చేసి వెస్టిండీస్‌‌తో రెండు టెస్టుల సిరీస్‌‌కు రెడీ అయింది. అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం (అక్టోబర్ 02) మొదలయ్యే తొలి టెస్టులోశుభ్‌‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది.  బలాబలాలు చూస్తే గిల్‌‌సేనకు విండీస్ పోటీ ఇస్తేనే గొప్ప అనొచ్చు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పరంగా ఈ సిరీస్‌‌ను ఇండియా సీరియస్‌గానే తీసుకుంది.  

సెలెక్షన్ టెన్షన్‌‌

గతేడాది నవంబర్‌‌‌‌లో చివవగా స్వదేశంలో టెస్టు ఆడిన తర్వాత  లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,  అశ్విన్ ఈ ఫార్మాట్‌‌కు గుడ్‌‌బై చెప్పారు. అయినా  జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. కొత్త కెప్టెన్‌‌, కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగి ఇంగ్లండ్ గడ్డపై సిరీస్‌‌ను డ్రా చేసుకొని ఔరా అనిపించింది. అయితే, ఈ సిరీస్‌‌లో  జట్టు కూర్పుపై ఉత్కంఠ మొదలైంది. ఎక్స్‌‌ట్రా బ్యాటర్‌‌గా దేవదత్ పడిక్కల్‌‌ను తీసుకుంటారా లేక సీమ్ బౌలింగ్ ఆల్-రౌండర్ నితీష్ రెడ్డికి అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.  జడేజా, కుల్దీప్ మెయిన్‌‌ స్పిన్నర్లుగా బరిలోకి దిగడం ఖాయం. అవసరమైతే సుందర్ లేదా అక్షర్ పటేల్‌‌ను మూడో స్పిన్నర్‌‌గా పరిగణించవచ్చు. కరుణ్ నాయర్‌‌‌‌పై వేటు పడిన  నేపథ్యంలో మూడో నంబర్‌‌‌‌లో సాయి సుదర్శన్ ఆడటం ఖాయమైంది. ఆస్ట్రేలియా–ఎపై భారీ సెంచరీ చేసి  అద్భుతమైన ఫామ్‌‌లో ఉన్న కేఎల్ రాహుల్ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్‌‌‌‌ తర్వాత విశ్రాంతి తీసుకున్న యశస్వి జైస్వాల్ కూడా ఉత్సాహంగా ఉన్నాడు. ఆసియా కప్‌‌లో బ్యాటర్‌‌‌‌గా ఫెయిలైన కెప్టెన్ గిల్ ఇంగ్లండ్‌‌ టూర్‌‌‌‌లో 754 రన్స్‌‌ సాధించిన తన టెస్టు ఫామ్‌‌ను తిరిగి అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.  

కష్టాల్లో కరేబియన్లు

ప్రస్తుతం వెస్టిండీస్ టీమ్ అన్ని ఫార్మాట్లలోనూ ఆ టీమ్ చెత్తగా ఆడుతోంది. రెండు రోజుల కిందట నేపాల్ చేతిలో టీ20 సిరీస్‌‌ ఓడిన ఆ జట్టు రెడ్‌‌బాల్‌‌తోనూ నిరాశ పరుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి టెస్టులో 27 రన్స్‌‌కే ఆలౌట్ అయిన అవమానం కరీబియన్లను ఇంకా వెంటాడుతోంది. దీనికి తోడు ఆ టీమ్ మెయిన్ ఫాస్ట్ బౌలర్లు షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ గాయాలతో దూరం కావడం బౌలింగ్ విభాగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. పేసర్ జేడెన్ సీల్స్, లెఫ్టార్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్‌‌లపైనే బౌలింగ్ భారం పడనుంది. బ్యాటింగ్‌‌ను బలోపేతం చేసేందుకు క్రెయిగ్ బ్రాత్‌‌వైట్‌‌ను పక్కనపెట్టి తేజ్‌‌నారాయన్ చంద్రపాల్, అలిక్ అతానజేను జట్టులోకి తీసుకున్నారు. కెప్టెన్ రోస్టన్ చేజ్ బ్యాటింగ్‌‌తో పాటు జట్టులో ఏకైక రైట్‌ ఆర్మ్‌  స్పిన్నర్‌‌గా కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లో బలహీనంగానే ఉన్న కరీబియన్ టీమ్.. స్వదేశంలో అత్యంత బలమైన ఇండియాకు ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.
పిచ్/వాతావరణం
గతంలో స్వదేశంలో పూర్తిగా స్పిన్ పిచ్‌‌లను  తయారుచేసి విమర్శల పాలైన ఇండియా ఈసారి గ్రీన్ వికెట్‌‌ను రెడీ చేసింది. మ్యాచ్‌‌కు అంతరాయం కలిగించే స్థాయిలో వర్షం పడే సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా)
ఇండిమా: జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్ (కెప్టెన్‌‌), జురెల్ (కీపర్), జడేజా , సుందర్, నితీష్ రెడ్డి, అక్షర్/కుల్దీప్, బుమ్రా/ప్రసిధ్‌‌, సిరాజ్.
వెస్టిండీస్‌‌: తేజ్‌‌నరైన్, కెవ్లోన్, అతానజే, బ్రెండన్ కింగ్, షై హోప్ (కీపర్‌‌‌‌), రోస్టన్ చేజ్ (కెప్టెన్‌‌), గ్రీవ్స్, ఖారీ పియరీ, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్/జోహన్ లేన్, జేడెన్ సీల్స్.