సభ్యులు గౌరవంగా నడుచుకునేదాకా సభకు రాను : ఓం బిర్లా

సభ్యులు గౌరవంగా నడుచుకునేదాకా  సభకు రాను : ఓం బిర్లా

న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడంపై లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్షాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో సభ్యులంతా గౌరవంగా నడుచుకునేదాకా తాను సమావేశాలకు హాజరు కానని ఆయన తేల్చి చెప్పారు. ఆ కారణంగానే ఓం బిర్లా బుధవారం లోక్​సభకు హాజరు కాలేదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు(ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన బిల్లు) మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టారు. 

బిల్లుపై కేంద్రహోం మంత్రి అమిత్​షా మాట్లాడుతుండగా అపొజిషన్ సభ్యులు బిల్లు కాపీలను చించి స్పీకర్ పోడియంపైకి విసిరేశారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు కూడా గట్టిగా నినాదాలు చేశారు. దీంతో బిల్లుపై చర్చ, ఓటింగ్ జరగకుండా సభ ముగిసింది. ఈ పరిణామాలతో స్పీకర్ ఓం బిర్లా అసహనానికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సభా గౌరవాన్ని స్పీకర్ అత్యంత ఉన్నతంగా చూస్తారని, కార్యకలాపాల సమయంలో సభ్యులు మర్యాదపూర్వకంగా ఉండాలని  ఆయన ఆశిస్తున్నారని తెలిపాయి.

ఇయ్యాల్టికి వాయిదా.. 

బుధవారం కూడా సభా కార్యకలాపాలు వాయిదాలతోనే ముగిశాయి. ఉదయం సభ ప్రారంభంకాగానే అపొజిషన్ సభ్యులంతా మణిపూర్​లో గొడవలపై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందేనని డిమాండ్ చేశారు. సభ్యులు శాంతించాలని బీజేపీ సభ్యుడు కిరీట్ సోలంకి కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలదాకా వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభం కాగానే అపొజిషన్ సభ్యులు సేమ్ సీన్ రిపీట్ చేశారు. మణిపూర్ అంశంపై ఆందోళన కొనసాగించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ సభను  గురువారం దాకా వాయిదా వేశారు.