
సోలో (ఇండోనేషియా): ఆసియా జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్–డి చివరి లీగ్ మ్యాచ్‌లో యంగ్ ఇండియా110–-100 పాయింట్ల తేడాతో హాంకాంగ్ జట్టును ఓడించింది. ఈ విక్టరీతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇండియా సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే ఇండియా, హాంకాంగ్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్ టాపర్‌ను నిర్ణయించే పోరులో ఇండియా షట్లర్లు సత్తా చాటారు.
రుజుల రాము 11–8తో సమ్ యవును ఓడించి అద్భుతమైన ఆరంభం ఇవ్వగా.. డబుల్స్‌లో భార్గవ్ రామ్–-విశ్వ తేజ్ జంట 22–13తో చుయెంగ్ షింగ్–డెంగ్ చి ఫైపై నెగ్గింది. హాంకాంగ్ పుంజుకునే ప్రయత్నం చేసినా.. జూనియర్ వరల్డ్ నంబర్ వన్ షట్లర్ తన్వి శర్మ విమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో గెలిచి జట్టుకు నిర్ణయాత్మక ఆధిక్యాన్ని అందించింది. చివరివరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఇండియా విజయాన్ని అందుకుంది. ఈ టోర్నమెంట్‌లో 2011లో కాంస్య పతకం సాధించడమే ఇండియా బెస్ట్ పెర్ఫామెన్స్.