Gutta Jwala: గొప్ప పని చేసిన గుత్తా జ్వాల.. తల్లి పాలు దానం చేసింది.. ఇప్పటి వరకు 30 లీటర్లు విరాళం

Gutta Jwala: గొప్ప పని చేసిన గుత్తా జ్వాల.. తల్లి పాలు దానం చేసింది..  ఇప్పటి వరకు 30 లీటర్లు విరాళం

హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా అందరూ మెచ్చే చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లి పాలను విరాళంగా ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 ఏప్రిల్ 22న నటుడు విష్ణు విశాల్ను పెళ్లి చేసుకున్న గుత్తా జ్వాలా.. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రతిరోజూ తన బిడ్డకు సరిపడా పాలను పట్టిన తర్వాత మిగిలిన పాలను బాటిల్లో పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి సరఫరా చేశారు. రోజుకు సుమారు 600 మిల్లీ లీటర్ల చొప్పున ఇప్పటి వరకు 30 లీటర్ల తల్లి పాలను దానం చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్లో వెల్లడించారు.

తల్లి పాలు లేని శిశువులకు తన పాలు ఉపయోగపడితే అంతకన్నా కావాల్సింది ఏముంటుందని పేర్కొన్నారు. దేశంలోనే మొదటి సారిగా ఒక అథ్లెట్ ఈ విధంగా తన పాలను దానం చేయడం నిజంగా స్పూర్తిదాయకమంటూ విషయం. తెలిసిన వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లి లేని పిల్లలకు, పాలు పడని తల్లుల పిల్లలకు లేదా హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్న తల్లుల పిల్లలకు ఈ పాలను అందిస్తారు.

తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి. కాన్పు తర్వాత మొదటి రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు చాలా ముఖ్యమైనవి. భావి ఆరోగ్యానికి తొలి బీజం వేసేవి ఇవే. ఇవి ఒక రకంగా తొలి టీకా లాంటివి. ఇందులో ఉండే ఇమ్యునోగ్లోబులిన్లు బిడ్డ రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఇన్‌‌‌‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి.

►ALSO READ | Asia Cup 2025: ఆసియా కప్‌లో యూఏఈ బోణీ.. ఒమన్ ఓటమితో సూపర్-4కు ఇండియా

ఐదారు రోజులకు పాలు కాస్త పలుచబడినప్పటికీ వాటిలో కొవ్వులు, లాక్టోజ్ బాగా ఉంటాయి. అవి బిడ్డకు మరింత శక్తినిస్తాయి. రెండు వారాల తర్వాత తల్లిపాలలో 90% నీరు.. 8% పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు.. 2% ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా బిడ్డ అవసరాలకు అనుగుణంగా మారిపోయే తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. పిల్లలకు కనీసం ఆరు నెలల పాటు కచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.