సమాజంలోని అనేక ప్రశ్నలకు బాలగోపాల్ రచనల్లో సమాధానాలు: మానవ హక్కుల వేదిక

సమాజంలోని అనేక ప్రశ్నలకు బాలగోపాల్ రచనల్లో సమాధానాలు: మానవ హక్కుల వేదిక

హైదరాబాద్ సిటీ, వెలుగు: మానవ హక్కుల నేత కె. బాలగోపాల్ తన మేధోమథనంతో సమాజంలోని క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికారని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు, జాతీయ మానవ హక్కుల సంఘాల నాయకులు అన్నారు. తన రచనలు, మాటలు, చేతల ద్వారా ఈ తరాన్ని కూడా ఆయన ప్రభావితం చేయగలుగుతున్నారని స్మరించుకున్నారు. 

సమాజంలో ఎన్నో ప్రశ్నలకు బాలగోపాల్ రచనల్లో సమాధానాలు దొరుకుతాయని.. ఆయన రచనలు నేటి యువతకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సాహిత్యంలో, క్షేత్ర స్థాయి ఉద్యమాల్లోనే కాకుండా లాయర్ గా కూడా బాల గోపాల్ తన మేధస్సును సమాజానికి, మానవ హక్కుల సాధనకు ఉపయోగించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 

ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో బాలగోపాల్16వ వర్ధంతి సందర్భంగా స్మారక సదస్సు జరిగింది. ‘ప్రతి మనిషికి ఒకే విలువ’ అనే సందేశంతో నిర్వహించిన ఈ సదస్సుకు మానవ హక్కుల కార్యకర్తలు, పౌర హక్కుల నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో కేంద్ర ప్రభుత్వ విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎన్నికల వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలపై చర్చించారు.    

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు: యోగేంద్ర యాదవ్  

కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేషన్ బిల్డింగ్ అంటూ కేవలం కాంట్రాక్టర్లను బిల్డ్ చేస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, డీలిమిటేషన్, ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లను వేర్వేరుగా చూసినప్పుడు ఏమీ అనిపించదు. కానీ, కలిపి చూసినప్పుడు ఎలెక్టోరల్ డెమోక్రసీపై ప్రభావం చూపుతున్నాయి. 

2024 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలు ప్లెబిసైట్ వంటివి. ప్రజల నుంచి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కావాలని మోదీ భావించారు. రష్యాలో ఉన్నట్టుగా ఎలెక్టోరల్ ఆటోక్రసీ కావాలని కోరుకున్నారు” అని వివరించారు. బీజేపీ శాశ్వత అధికారాన్ని కోరుకుంటోందన్నారు.

 ‘‘2026లో జనాభా లెక్కలు ఉంటాయి. ఇది డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌కు ఇండికేషన్. లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాల పునర్విభజన జరిగితే కేరళలో 20 నుంచి12కి, తమిళనాడులో 39 నుంచి 31కి, తెలంగాణలో17 నుంచి 13కి స్థానాలు తగ్గుతాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో 226 నుంచి 259కి పెరుగుతాయి. ఇది ఉత్తర-, దక్షిణాది మధ్య ప్రమాదకరమైన అసమానతలకు దారి తీస్తుంది. డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌ను శాశ్వతంగా ఫ్రీజ్ చేయడమే పరిష్కారం” అని ఆయన అన్నారు.

 ‘‘ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్ బిహార్‌‌‌‌‌‌‌‌కు మాత్రమే పరిమితం కాదు, ఇండియా మొత్తానికి వర్తింపచేస్తారు. బిహార్‌‌‌‌‌‌‌‌లో డెడ్‌‌‌‌‌‌‌‌లైన్ పెట్టి డీటెయిల్స్ ఇవ్వకుంటే ఓటర్ లిస్ట్ నుంచి తప్పించేశారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్లు చూపి పౌరత్వం నిరూపించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి దేశంలో మొదటిసారి వచ్చింది’’ అని హెచ్చరించారు. 

కేంద్రం మానవ హక్కుల ఉల్లంఘన: నందిని సుందర్  

కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నందిని సుందర్ విమర్శించారు. మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించిన వారిని యాంటీ రాడికల్స్ అంటూ ముద్ర వేస్తున్నారన్నారు. అనేక మందిని పట్టుకుని టార్చర్ చేసి, కాల్చి చంపేశారని, బూటకపు ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్లతో కేంద్రం ఏం సాధిస్తోందని ప్రశ్నించారు. 

ఆదివాసీలకు భూములు, స్థలాలపై ఎలాంటి హక్కులు లేని పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఆదివాసీలు తమ ప్రాంతాలకు వెళ్లాలన్నా ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు. విలువైన ఖనిజ సంపద ఉన్న ప్రాంతాల్లో మావోయిస్టులుగా ముద్ర వేసి, గిరిజన ప్రజలను ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాని చోట కూడా స్థానికులపై మావోలుగా ముద్ర వేస్తున్నారని అన్నారు. 

కార్యక్రమంలో పీఎస్ అజయ్ కుమార్, అపర్​గుప్తా, మానవ హక్కుల వేదిక  తెలంగాణ  అధ్యక్షుడు భుజంగరావు,  ఏపీ అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, తెలంగాణ కార్యదర్శి తిరుపతయ్య, ఏపీ కార్యదర్శి రాజేశ్, సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, వసంత, వీహెచ్ కృష్ణ, చంద్రశేఖర్ ​పాల్గొన్నారు.