పొరుగు రాష్ట్రాలకూ మన బాలామృతం.. నాచారంలో బాలామృతం ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

పొరుగు రాష్ట్రాలకూ మన బాలామృతం.. నాచారంలో బాలామృతం ఉత్పత్తి  కేంద్రం ప్రారంభం

 

  • ప్లాంట్ సామర్థ్యాన్ని  పెంచినం: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • మహిళల ఆర్థిక సాధికారత.. చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత
  • ఫ్రీ బస్సుతో మహిళలకు ప్రతి నెలా రూ.10 వేలు ఆదా 
  • 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను  చేయడమే లక్ష్యమని వెల్లడి


హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారత, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని సీఎం  రేవంత్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను  చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాచారంలో 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన  బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య దశ నుంచే పోషకాహార లోపాన్ని నివారించేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అనేక కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని  వివరించారు. ఈ కొత్త బాలామృతం ఉత్పత్తి కేంద్రం ద్వారా తయారయ్యే పోషకాహారాన్ని తెలంగాణ, ఏపీతోపాటు పొరుగున ఉన్న మరో 4, 5 రాష్ట్రాలకు సరఫరా చేసేలా ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచినట్టు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన, పోషకాహారం

చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా రంగానికి ఏడాదికి సుమారు రూ.27 వేల కోట్లు కేటాయిస్తున్నామని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచిత నాణ్యమైన విద్యతోపాటు ఉదయాన్నే పిల్లలకు రాగి జావ, పాలు, ఇడ్లీ, పూరీలాంటి బలవర్థకమైన అల్పాహారాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని, ఈ భోజన నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పాఠశాలల్లోని సుమారు 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో పాటే అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేసేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంతో ఆహారంలో నాణ్యతా లోపాలు లేకుండా చూసే అవకాశం లభిస్తుందన్నారు. 

మహిళల భద్రత, సంక్షేమానికి పెద్దపీట

ప్రజాపాలన ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించామని, ఇప్పటివరకు ఇందుకోసం ఆర్టీసీకి ప్రభుత్వం రూ.11వేల కోట్లు చెల్లించిందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. దీంతో ప్రయాణ ఖర్చులు తగ్గి మహిళలకు నెలకు సగటున రూ.10 వేల వరకు పొదుపు అవుతోందన్నారు. అలాగే, పేదలకు నిర్మించి ఇచ్చే ప్రతి ఇందిరమ్మ ఇల్లును మహిళ పేరు మీదనే కేటాయిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 6.5 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు త్వరలోనే హైదరాబాద్ నగర పరిధిలో భూమి లేని నిరుపేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులతోపాటు నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు.

ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు

మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్ సిటీ శిల్పారామం సమీపంలోని రూ.వెయ్యి కోట్ల విలువైన మూడున్నర ఎకరాల స్థలాన్ని ‘ఇందిరా మహిళా శక్తి కేంద్రం’గా మార్చి, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయాల కోసం 150 దుకాణాలతో నైట్ బజార్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.  ప్రభుత్వ కార్యాలయాల్లోని క్యాంటీన్ల నిర్వహణతోపాటు పెట్రోల్ బంకుల యాజమాన్య బాధ్యతలను మహిళలకే అప్పగిస్తున్నామని తెలిపారు. ఐకేపీ సంఘాలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించడంతో పాటు రూ.2 వేల కోట్ల వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించి సున్నా వడ్డీ రుణాలను సమకూరుస్తోందని స్పష్టం చేశారు.

పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యం: మంత్రి సీతక్క

చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.  50 ఏండ్ల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అంగన్‌‌‌‌వాడీ సేవలకు, టీజీ ఫుడ్స్‌‌‌‌కు బీజం వేసిందని గుర్తుచేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం ఇక్కడి నుంచే పౌష్టికాహారాన్ని తయారు చేసి అందిస్తున్నామని చెప్పారు.   చిన్నారుల నుంచి పండు ముసలి దాకా ఆడబిడ్డలందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.