పర్యాటక కేంద్రాల అభివృద్ధికి..రూ.800 కోట్లు ఖర్చు చేశాం: కిషన్ రెడ్డి

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి..రూ.800 కోట్లు ఖర్చు చేశాం: కిషన్ రెడ్డి

పంజాగుట్ట/ హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో ‘ప్రసాద్’, ‘స్వదేశ్ దర్శన్’ స్కీమ్స్​లో భాగంగా సాంస్కృతిక, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రూ.800 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. 15వ శతాబ్దం నాటి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్​ను రూ.4.40 కోట్ల నిధులతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్​గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బల్కంపేటలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్​పై ఈ ప్రోగ్రామ్​ను కిషన్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణా రావు లైవ్ చూశారు. తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడారు. 

‘‘రూ.39 కోట్లతో అమ్మవారి శక్తి పీఠమైన జోగులాంబలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. భువనగిరి కోట చరిత్ర భావితరాలకు తెలిసేలా గైడెడ్ టూర్లు, లైట్ షోలు వంటి సౌకర్యాల ఏర్పాటుకు రూ.57 కోట్లు కేటాయించారు. అదేవిధంగా, అనంత పద్మనాభ స్వామి కొలువైన అనంతగిరిని పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు రూ.38 కోట్లతో అభివృద్ధి పనులు చేపడ్తాం”అని తెలిపారు. ఇసుక తప్పా ఏమీలేని దుబాయి, సింగపూర్ పర్యాటక రంగాల్లో అగ్రగామిగా రాణిస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. అన్నీ సౌలత్​లు ఉన్న ఇండియాలో ఎన్నో పురాతన కట్టడాలు, ఆలయాలకు ప్రాధాన్యత లేదని తెలిపారు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంపై మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 

బీజేపీని దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నరు

బీజేపీని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. కష్టపడి పని చేస్తే మోజార్టీ ఎంపీ స్థానాల్లో ఈజీగా గెలుస్తామన్నారు.