గుర్తులు తారుమారు.. నిలిచిన పోలింగ్‌

గుర్తులు తారుమారు.. నిలిచిన పోలింగ్‌

తొలి విడతలో భాగంగా 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పలుచోట్ల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బ్యాలెట్ లో గుర్తులు తారుమారు కావటం, అభ్యర్థుల పేర్లు మిస్సింగ్ కావటం.. ఉద్రిక్తతలకు దారితీసింది. సంస్థానం నారాయణపురం మండలం కంకణాలపల్లి, కొత్తగూడెంలో బ్యాలెట్ లో గుర్తులు తారుమారయ్యాయి. దేవరకొండ మండలం తెలుగుపల్లిలో అభ్యర్థుల పేర్లు మిస్సయ్యాయి. దీంతో పోలింగ్ స్టేషన్ లో అధికారులతో గొడవకు దిగారు అభ్యర్థులు. పోలింగ్ నిలిపేయాలని పట్టుపట్టారు.

రంగారెడ్డి మొయినాబాద్‌ మండలం హజీజ్‌ నగర్‌లోని 111 నంబర్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్‌ నిలిచింది.ఒక గ్రామానికి చెందిన బ్యాలెట్‌ పత్రాలు మరో గ్రామానికి చేరడంతో గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు ఇక్కడా కాసేపు పోలింగ్‌ నిలిపివేశారు. ఇదే కారణంతో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్‌ నిలిచింది. జనగామకు చెందిన బ్యాలెట్‌ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.