ఉమ్మడి ఏపీలో రేవంత్..ఇప్పుడు బల్మూరి వెంకట్

ఉమ్మడి ఏపీలో రేవంత్..ఇప్పుడు బల్మూరి వెంకట్

 

  • అతిచిన్న వయసులో ఎన్నికైతున్న నేతగా రికార్డు
  • నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి, మహేశ్ కుమార్ గౌడ్
  • ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవమే.. 22న అధికారికంగా ప్రకటన!

హైదరాబాద్, వెలుగు: ‘పెద్దల సభ’గా చెప్పుకునే శాసనమండలికి చిన్నోడు బల్మూరి వెంకట్ ఎన్నికైతున్నరు. 31 ఏండ్ల 3 నెలల వయసులోనే కౌన్సిల్‌‌లో అడుగు పెట్టనున్న నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటిదాకా 35 ఏండ్ల లోపున్న లీడర్లెవరూ మండలికి ఎన్నిక కాకపోవడం గమనార్హం. గురువారం ఈ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్‌‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తమ నామినేషన్లను దాఖలు చేశారు. 

అసెంబ్లీ సెక్రటేరియెట్​లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అసెంబ్లీ అంతా సందడిగా మారింది. మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌.. ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ బ్యాగ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్లు కావడం విశేషం.

ఇద్దరే దాఖలు

రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉన్నా.. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. ఎమ్మెల్యేలుగా గెలవడంతో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీగా ఉన్న ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆ రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్​ నోటిఫికేషన్ ఇచ్చింది. రెండు స్థానాలూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే దక్కే అవకాశం ఉండటంతో.. తాము పోటీలో ఉండబోమని బీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. దీంతో ఆ రెండు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. శుక్రవారం నామినేషన్లను అసెంబ్లీ సెక్రటేరియెట్ జాయింట్ సెక్రటరీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.హెచ్.ఉపేందర్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. నామినేషన్లు ఎక్కువ దాఖలైతే 29న ఎన్నికలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే రెండు స్థానాలకు రెండే నామినేషన్లు రావడంతో నామినేషన్ల ఉపసంహరణకు ఇచ్చిన గడువు (ఈనెల 22) రోజునే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించనున్నారు.

ఉమ్మడి ఏపీలో రేవంత్..ఇప్పుడు బల్మూరి వెంకట్

మండలిలో అడుగు పెట్టిన అతి చిన్న వయస్కుడిగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో రికార్డు సృష్టించారు. 2007లో స్థానిక సంస్థల కోటాలో గెలిచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు అప్పటికి 37 ఏండ్లు. ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున మండలిలోకి పాడి కౌశిక్ రెడ్డి 37 ఏండ్ల వయసులోనే అడుగుపెట్టారు. ఇప్పుడు వారిద్దరి రికార్డును బల్మూరి వెంకట్ అధిగమించనున్నారు. తనను అభినందించేందుకు వచ్చిన నేతలు, మీడియాతో బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్సీ తానేనని ఆయన చెప్పుకొచ్చారు. అంతకుముందు 32 ఏండ్ల వయసులో గుజరాత్​కు చెందిన ఓ లీడర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని తెలిపారు.

కష్టపడ్డోళ్లకు గుర్తింపు: ఉత్తమ్

పార్టీలో కష్టపడి పనిచేసినోళ్లకు గుర్తింపు దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడమే నిదర్శనమని చెప్పారు. ఏఐసీసీ ఇన్​చార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అందరం కలిసి ఏకగ్రీవంగా వాళ్లిద్దరి పేర్లను ఖరారు చేశామని చెప్పారు. వారి పోరాటం, పార్టీ కోసం పనిచేసిన తీరుతోనే అవకాశం ఇచ్చి పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. సర్పంచుల బిల్లులను ఆపిందే గత ప్రభుత్వమని, అలాంటిది ఇప్పుడు వారి తరఫున పోరాడుతామంటూ కేటీఆర్ చెప్పడం ఓ జోక్​ అని ఎద్దేవా చేశారు.