కస్టమర్ సర్వీస్ టు పబ్లిక్​ సర్వీస్

కస్టమర్ సర్వీస్ టు  పబ్లిక్​ సర్వీస్

నీల జంగయ్య కవిత్వం – సమగ్ర పరిశీలన అనే అంశంపై పార్ట్ టైంలో పీహెచ్‌‌డీ చేస్తున్నా. తెలుగు పీజీ ఎంట్రన్స్ రాసే అభ్యర్థుల కోసం  పుస్తకాన్ని తీసుకొచ్చా.

వొడాఫోన్ నెట్‌‌వర్క్ కంపెనీలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌‌గా పనిచేసిన బామండ్ల రాజు ఇప్పుడు గవర్నమెంట్‌‌ సర్వీస్‌‌లో చేరి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన అతను ప్రైవేటు కంపెనీలో కంటే ప్రభుత్వంలో భాగమైతే ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయవచ్చన్న భావనే తనను టీజీటీ, పీజీటీ ప్రస్తుతం జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించేలా చేసిందని గర్వంగా చెబుతున్నాడు. టీజీటీ, పీజీటీ సాధించి, జూనియర్ లెక్చరర్ పరీక్ష(తెలుగు సబ్జెక్ట్) లో ఏకంగా రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. 

అందరు చదివే పుస్తకాలనే మనమూ చదివితే టాప్‌‌లో ఎలా ఉంటాం? అసలు జాబ్‌‌ ఎలా వస్తుంది అని నిరంతరం నన్ను నేను క్వశ్చన్ చేసుకునేవాణ్ని. డిఫరెంట్‌‌ చదవాలనే ఉద్దేశంతో ప్రామాణిక గ్రంథాలను ఎంచుకున్నా.  బుక్స్ పెద్దగా ఉన్నా భయపడకుండా చదివా. ఉదయం నాలుగు గంటలకే లేచి పుస్తకం పట్టుకునేవాణ్ని. దీంతో అందరూ ప్రిపరేషన్ మొదలుపెట్టే సమయానికి నేను రెండు, మూడు గంటలు అదనంగా చదివి ఉండేవాడిని. అలా 2017లో యూజీసీ నెట్ రాస్తే ఆల్‌‌ ఇండియా టాప్–10 ర్యాంకు వచ్చింది. ఓయూలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్​గా చేరా. అప్పుడే పీజీటీ, టీజీటీ నోటిఫికేషన్ వచ్చింది. టీజీటీలో ఓపెన్‌‌ కేటగిరీలో పదో స్థానంలో నిలిచా. అనంతరం 2018లో నిర్వహించిన పీజీటీ పరీక్షలో స్టేట్ లెవల్‌‌లో 12వ ర్యాంకు, ఆరో జోన్‌‌లో 6వ ర్యాంకు, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్‌‌లో నిలిచా.  సిద్దిపేటలోని మైనారిటీ గురుకులంలో పీజీటీగా జాయిన్ అయిపోయా.

ఆ తర్వాత టీఎస్‌‌పీఎస్‌‌సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రిపేరవలేదు. టీజీటీ, పీజీటీ కోసం చదివిన చదువునే మళ్లీ రివిజన్ చేశా. రోజుకు 12గంటలకు పైనే చదివా.   జేఎల్ తెలుగు సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం పీజీటీగా చేస్తున్నా త్వరలోనే జేఎల్‌‌గా జాయిన్ అయిపోతా. నాన్న మల్లయ్య వ్యవసాయ కూలీ, అమ్మ లక్ష్మి బీడీలు చేస్తుంటారు. వారి కష్టమే నన్ను గవర్నమెంట్ జాబులు సాధించేలా చేసింది. – సిద్దిపేట,  వెలుగు