Timed Out: మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్ ఆలోచన షకీబ్‌ది కాదు.. తెరవెనుక మరో బంగ్లా క్రికెటర్

Timed Out: మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్ ఆలోచన షకీబ్‌ది కాదు.. తెరవెనుక మరో బంగ్లా క్రికెటర్

రెండ్రోజుల క్రితం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని పక్కనపెడితే, చోటుచేసుకున్న వివాదాలు మాత్రం అనేకం. శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నడూ చూడని రీతి(టైమ్‌డ్ ఔట్ పద్దతి)లో ఔటవ్వడం.. కొద్దిసేపటి తరువాత ఇరు జట్ల కోచ్‌ల మధ్య వాడి వేడి చర్చ.. మ్యాచ్ ముగిశాక లంక ఆటగాళ్లు బంగ్లా క్రికెటర్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు జరిగాయి.

ఈ మ్యాచ్ వివాదాస్పదం అవ్వడానికి మూలకారణం.. మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్ నిర్ణయం. అతడు సరైన సమయానికి క్రీజులోకి వచ్చినా.. హెల్మెట్‌లో సమస్య కారణంగా రెండు నిమిషాల్లోపు బంతిని పేస్ చెయ్యలేకపోయాడు. ఫలితంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల హసన్ దానిపై అప్పీల్ చేయడం.. అంపైర్లు ఔట్ ఇవ్వడం జరిగిపోయాయి. అనంతరం తన ఔట్ నిర్ణయంపై మాథ్యూస్‌ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. షకిబ్ వెనక్కు తీసుకునేది లేదని తేల్చిచెప్పాడు. దాంతో మాథ్యూస్‌ బంతిని ఫేస్‌ చేయకుండానే నిరాశతో పెవిలియన్ చేరాడు. తాజాగా, ఈ టైమ్‌డ్ ఔట్ ఆలోచన షకీబ్‌ది కాదని కథనాలు వస్తున్నాయి. దీని వెనుక బంగ్లా బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ షాంటో హస్తమున్నట్లు నెటిజెన్స్ చెప్తున్నారు.

మ్యాచ్ ముగిశాక పోస్ట్ ప్రెసెంటేషన్ లో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. బంగ్లా ఫీల్డర్లలో ఒకరు తన వద్దకు వచ్చి ఇప్పుడు అప్పీల్ చేస్తే నిబంధనల ప్రకారం మాథ్యూస్ ఔట్ అవుతారని చెప్పాడని వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో షకీబ్.. అతని పేరు బయటకి చెప్పలేదు. అయితే అతనెవరో కాదని.. నజముల్ హుస్సేన్ శాంటో అని నెటిజెన్స్ చెప్తున్నారు. ఈ ఘటన జరిగడానికి కొన్ని సెకన్ల ముందు షకీబ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో మాట్లాడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై శాంటో వివరణ ఇస్తారేమో వేచిచూడాలి.

ఇక ఆ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లంక  చరిత అసలంక(10) రాణించడంతో 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అనంతరం బంగ్లాదేశ్‌ 280 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి మరో 30 బంతులు మిగిలివుండగానే చేధించింది.