- బండారు దత్తాత్రేయ
అబిడ్స్, వెలుగు: బీసీలు ఏకమైతేనే వివిధ రంగాల్లో తమ హక్కులను సాధించగలరని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం రాత్రి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘మన ఆలోచన సాధన సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ జనజాగరణ జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనాభాలో బీసీల శాతం ఎక్కువగా ఉన్నందున వారిలో చైతన్యం, అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్యమంలో మహిళలను కూడా భాగస్వాములుగా చేయాలని సూచించారు.
బీసీ కులవృత్తులు హిందూ ఆధ్యాత్మిక భావాలతో ముడిపడి ఉన్నాయని, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బీసీల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు భూర నర్సయ్య, ఆనందకుమార్, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ ఉద్యమ నాయకులు విఠల్, చెరుకు సుధాకర్, గుజ్జ కృష్ణ, మాజీ ఐఎఎస్ అధికారి చీరంజీవులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ రాములు, కాంగ్రెస్ నాయకుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

