ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్ సేవలను ప్రజలకు తెలియజేయండి : బండి సంజయ్

ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్ సేవలను ప్రజలకు తెలియజేయండి : బండి సంజయ్
  • ఎన్‌‌డీఎంఏ అధికారులకు బండి సంజయ్ సూచన

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్‌‌డీఎంఏ) అందిస్తున్న సేవల గురించి ప్రజలకు తెలియజేయాలని అథారిటీ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. తుపానులు, వరదలు, ఇతర ప్రమాదాల టైంలో ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్ సిబ్బంది ఎంతో సాహసంతో సేవలు అందిస్తున్నారని.. అయినా ఈ విషయాలేవి ప్రజలకు తెలియడం లేదన్నారు. 

వారి సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. బుధవారం ఆయన ఎన్‌‌డీఎంఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అథారిటీ ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్‌‌డీఎంఏ అందిస్తున్న సేవలను, చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ..'సచేత్' యాప్‌‌ను ప్రతిఒక్కరూ డౌన్‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా వర్షాలు, వరదలు వంటి విపత్తులకు సంబంధించిన రియల్‌‌ టైమ్ సమాచారం పొందవచ్చని, ఇప్పటివరకు 13.9 లక్షల డౌన్‌‌లోడ్‌‌లు జరిగాయని వివరించారు. 

రెస్క్యూ సిబ్బందికి జాకెట్లు, రోప్‌‌లు, గ్యాస్ కట్టర్లు వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని, దిశా సమావేశాల్లో ఎన్‌‌డీఎంఏ సేవలను చేర్చాలని సూచించారు. ఎన్డీఎంఏ అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. ప్రధానంగా ఈ ఏడాది తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, సిక్కిం వరదలు, వయనాడ్ ల్యాండ్‌‌స్లైడ్, హిమాచల్ వరదలు, 2023 బాలాసోర్ రైల్వే ప్రమాదం, సిల్క్యారా టన్నెల్ రక్షణలో ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్ సాహసోపేత చర్యలను వెల్లడించారు.