- కరీంనగర్‌లో బీజేపీకి మేయర్ పదవి రాకుండా కుట్ర: కేంద్ర మంత్రి బండి సంజయ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటైనయ్
- మేం మ్యాజిక్ ఫిగర్ దాటాం.. మీ ముగ్గురికీ కలిపి 26 సీట్లే
- మేయర్ సీటు కోసం ఆరాట పడేందుకు సిగ్గుండాలని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చినా మేయర్ పీఠం దక్కకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బీజేపీని కాదని, అడ్డదారిన మేయర్ పదవిని లాక్కోవాలని చూస్తే ఒక్కొక్కరిని రోడ్లపై ఉరికిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్‌లో ఆయా పార్టీల నేతలను తిరగనీయబోమని హెచ్చరించారు.
శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ది ఎంఐఎం అనుసంధానకర్తగా సాగుతున్న సంబంధమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ‘‘ఈ రోజు ఆ పార్టీలు ఒకరికొకరు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాయి. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూనే.. బీఆర్ఎస్‌కు ఎంఐఎం కన్ను కొడుతున్నది. ఈ మూడు పార్టీల బండారం కరీంనగర్ వేదికగా బయటపడబోతోంది’’ అని చెప్పారు.
మ్యాజిక్ ఫిగర్ దాటాం.. కుట్రలు చేస్తే ఊరుకోం
కరీంనగర్ ప్రజలు మోదీ పాలనను, కార్యకర్తల కష్టాన్ని చూసి బీజేపీకి పట్టం కట్టారని బండి సంజయ్ అన్నారు. ఇండిపెండెంట్లు కూడా తమకే మద్దతివ్వడంతో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటామని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు కలిసినా 26 సీట్లే ఉన్నాయి. మీకున్న సంఖ్య ఎంత? మీరు ఎట్లా మేయర్ అవుతారు. సిగ్గులేకుండా మేయర్ సీటు కోరుతున్నారా?’’ అని ప్రశ్నించారు.
ఎంఐఎంవి రజాకార్ బుద్ధులు
జీవం లేని ఎంఐఎంకు పునరుజ్జీవ ఉత్సవాలు జరుపుకోవడం హాస్యాస్పదమని సంజయ్ విమర్శించారు. ‘రజాకార్లు పాకిస్తాన్కు పోతూ ఎంఐఎంను ఇక్కడ వదిలేసి పోయారు. పునరుజ్జీవం అంటే మళ్లీ రజాకార్ల పాలన తెస్తారా? తెలంగాణ ఆడబిడ్డలను బట్టలిప్పి బతుకమ్మ ఆడించాలనుకుంటున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు టీడీపీ గతే!: ఎమ్మెల్సీ కొమరయ్య
రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా తయారైందో భవిష్యత్తులో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ కూడా గెలవకపోవడం ఆ పార్టీ పతానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమకు సంతృప్తికరంగానే ఉన్నాయని, రాష్ట్రంలో బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా పెరిగిందని తెలిపారు.
2028లో అధికారంలోకి వస్తం
దేశంలో రెండే సీట్లు ఉన్న స్థాయి నుంచి వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం లోకి వచ్చామని, తెలంగాణలోనూ 2028లో కాషాయ జెండా ఎగురుతుందని సంజయ్ జోస్యం చెప్పారు. కరీంనగర్ లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్ కే అంకితమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీకి 13 సీట్లే వస్తాయని స్టేట్ ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదిక ఇచ్చిందట అని పేర్కొన్నారు. కరీంనగర్ లో మేయర్ పదవి కోసం గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయనీ, బీజేపీ సింహం అని.. సింగిల్ గానే ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, లీగల్ సెల్ కన్వీనర్ ఆంటోనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
