
కరీంనగర్, వెలుగు: ఓటరు జాబితాలో దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్‌కు సీఎం రేవంత్ లేఖ రాయాలని, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అని సవాల్ విసిరారు. దొంగ ఓట్లతో బీజేపీ ఎంపీలు గెలిచారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు.
కరీంనగర్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల 25 వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే దొంగ ఓట్లంటూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తున్నదని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక్కసారైనా వార్డు మెంబర్ గానో, ప్రజాప్రతినిధిగానో గెలిచి ఉంటే ఓట్ల చోరీ సంగతి తెలిసేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో ఒక ఓటు వేసి.. జగిత్యాలలో మరో ఓటు.. చొప్పదండిలో ఇంకో ఓటు వేయడం సాధ్యమైతదా? అని ప్రశ్నించారు.
‘‘ఆయనే నన్ను బీసీ అన్నడు. బండి సంజయ్ బీసీ కాబట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మాట్లాడిండు. ఇప్పుడు మళ్లీ ఆయనే నన్ను దేశ్ ముఖ్ అని అంటున్నడు. ఆయన ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావడం లేదు. బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు. బీసీని ఉప రాష్ట్రపతి చేస్తే ఆయనను ఓడగొట్టాలని చూస్తరు. ఓడిపోతారని తెలిసి రెడ్డి అభ్యర్థిని ఉపరాష్ట్రపతి బరిలో దింపుతున్నారు. చివరకు ఆ సామాజికవర్గం వాళ్లు కూడా కాంగ్రెస్‌ను తిడుతున్నరు” అని పేర్కొన్నారు.
ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి ఎట్టొచ్చిన్రు?
కరీంనగర్‌లోని చాలా మైనారిటీ ఇండ్లల్లో వందల కొద్దీ దొంగ ఓట్లున్నాయని, వాటిని తొలగించాలని మాజీ మేయర్ సునీల్ రావు ఫిర్యాదు చేశారని సంజయ్ తెలిపారు. దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే బీజేపీ 8 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు గెలుస్తుందని ప్రశ్నించారు. ఓట్ల చోరీ జరిగితే కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చిందని అడిగారు. ఎన్నికలున్నా.. లేకున్నా హిందూ సమాజం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్ బీజేపీ కొట్లాడుతదని అన్నారు.
బైంసాలో పేద హిందువుల ఇండ్లను తగలబెట్టినప్పుడు ఈ కాంగ్రెసోళ్లు ఎటు పోయారని ప్రశ్నించారు. మక్కా యాత్రకు పోయే ముస్లింలకు డబ్బులిచ్చి అన్ని సౌకర్యాలిచ్చి పంపుతున్నారని, అయ్యప్ప భక్తులను పట్టించుకోరని విమర్శించారు. తాను కరీంనగర్ ఎంపీగా గెలిచానంటే అది హిందూ ఓట్లతోనేనని, ఆ విషయాన్ని గల్లా ఎగరేసుకొని ఎక్కడైనా చెప్తానన్నారు.
రోహింగ్యాలు 2014కు ముందు ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చారని, అప్పుడు అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్సేనని బండి సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. రోహింగ్యాలను పంపిద్దామంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సహకరించలేదన్నారు. పాస్‌పోర్టు, వీసా గడువు ముగిసిన తర్వాత విదేశీయులందరినీ వాళ్ల దేశాలకు పంపిస్తున్నామని తెలిపారు.