పసుపుబోర్డు, ట్రైబల్ ​వర్సిటీతో.. కేటీఆర్, కవిత ఆగమైతున్నరు: బండి సంజయ్

పసుపుబోర్డు, ట్రైబల్ ​వర్సిటీతో.. కేటీఆర్, కవిత ఆగమైతున్నరు: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: పసుపు బోర్డ్, ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటనలతో  కేటీఆర్, కవిత ఆగమవుతున్నారని ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కారు గ్యారేజీకి పోతుందని ట్విట్టర్ టిల్లు నారాజ్‌‌‌‌ అవుతున్నాడని, నిజామాబాద్‌‌‌‌లో చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నాడని ఆయన అన్నారు. తొమ్మిదేళ్ల దొంగ హామీల, దొంగ జపం బట్టబయలైందని మంగళవారం ట్వీట్ లో సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చి అమలు చేయని హామీలను సంజయ్ ట్వీట్ లో స్పష్టం చేశారు. “ వరంగల్‌‌‌‌ డల్లాస్‌‌‌‌ కాలే. నిజామాబాద్‌‌‌‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే, ఆదిలాబాద్‌‌‌‌కు ఎయిర్‌‌‌‌ అంబులెన్స్‌‌‌‌లు రాలే, కరీంనగర్‌‌‌‌ లండన్ కాలే, వేములవాడకు ఏటా రూ.100 కోట్లు అందలే, కొండగట్టు అంజన్న ఘాట్‌‌‌‌రోడ్డు గతి మారలే. లక్ష ఉద్యోగాలు రాలే, 3000 భృతి ఇయ్యలే,  రైతుల ఆత్మహత్యల ఆగలే,  పోడు పంచాయితీ పోలే, టీచర్ పోస్టులు భర్తీ కాలే, కొత్త పీఆర్సీ అమలు చేయలే” అని అన్నారు.హామీలన్నీ ఉత్తమాటలేనా?


సీఎం కేసీఆర్ ఎంప్లాయిస్ ను, టీచర్లను  నమ్మించి మోసం చేశారని, ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, దేశమే ఆశ్చర్యపోయేలా పే స్కేల్ ఇస్తానని నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్.. ఇచ్చిన మాట పూర్తిగా తప్పారని మంగళవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో సంజయ్ మండిపడ్డారు. గడువు ముగిసిన 3 నెలల తర్వాత కొత్త పీఆర్సీని  నియమించిన కేసీఆర్ 5 శాతం ఐఆర్ ప్రకటించి అన్యాయం చేశారన్నారు. ఉద్యోగులకు 3 డీఏలు(10.92 శాతం) పెండింగ్ లో ఉండగా 5 శాతం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వానికి భజన చేసే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని, రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచిన కేసీఆర్ పాలనలో ప్రస్తుతం ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితే లేదన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని సంజయ్​ సూచించారు.

కల్వకుంట్ల పాలనకు కౌంట్​ డౌన్​ స్టార్ట్

జగిత్యాల, వెలుగు: ట్విట్టర్ టిల్లు ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు మోదీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో​ బండి సంజయ్​ మండిపడ్డారు. ఆ కుటుంబ పాలనకు మోదీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారన్నారు. చీటర్లకు మోదీని విమర్శించే స్థాయి లేదన్నారు.  కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ ధ్యేయమని, తాను చెప్పింది తప్పు అయితే తడి బట్టలతో భాగ్యలక్ష్మి గుడికి వస్తారా? అని సవాల్ విసిరారు.