- రేవంత్ వల్లే గెలిస్తే మరి రాహుల్ గాంధీ పప్పుసుద్దేనా అంటూ కామెంట్
- 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ విజయమని వెల్లడి
కరీంనగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ కాదని, తెలంగాణ లూటర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్అయ్యారు. తెలంగాణ సొమ్మును దోచుకుని కేరళ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. రేవంత్ గేమ్ చేంజర్ అయితే... తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు కదా? అక్కడెందుకు గెలవలేదు? అని ప్రశ్నించారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే రాహుల్ గాంధీ పప్పు సుద్దేనా? అని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపు.. ఇది త్రిమూర్తుల (మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్) విజయమని అభివర్ణించారు. బెంగాల్లో టీఎంసీ ఎన్ని అరాచకాలు చేసినా దాడులను ఎదుర్కొని పోరాడిన బీజేపీ కార్యకర్తల త్యాగాలు ఫలించాయని కొనియాడారు. ఈనెల 10న మోదీ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాందిశీకుల భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమ్మక్కయ్యారని, త్వరలో ఆధారాలను బయటపెడతానంటూ మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 'కేటీఆర్... 48 గంటలు టైమిస్తున్నా.. ఆధారాలను బయటపెట్టు. లేకుంటే బతుకు బజారుకిడుస్తా అంటూ వార్నింగ్ఇచ్చారు. నిన్ను కరీంనగర్ లో అడుగుపెట్టనీయబోనని సవాల్ విసిరారు. కేటీఆర్ కు దమ్ముంటే... బండి సంజయ్, కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించేందుకు సిద్ధం కావాలని అన్నారు.
