- టాలెంట్ ఉన్న క్రికెటర్లను ఎందుకు సెలెక్ట్ చేస్తలేరని బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్/ఓల్డ్ సిటీ, వెలుగు: టాలెంట్ ఉన్న క్రికెటర్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై చర్యలు ఉండబోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విషయమై రాచకొండ కమిషనర్‌కు కూడా సమాచారమిచ్చామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సీఏలో టాలెంట్ ఉన్న క్రికెటర్లను ఎందుకు సెలెక్ట్ చేయడం లేదని నిలదీశారు.
గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు అవకాశం కల్పించడం లేదని, దీనిపై క్రికెటర్ల పేరెంట్స్ తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. నైపుణ్యం లేని హైదరాబాద్ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తూ వారి దగ్గర హెచ్‌సీఏ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై త్వరలోనే బీసీసీఐకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
సీఐడీ, డీజీపీ, రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు
హెచ్‌సీఏలో జూనియర్, సీనియర్ ప్లేయర్ల సెలెక్షన్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని డీజీపీ, సీఐడీ, రాచకొండ కమిషనర్‌కు తెలంగాణ క్రికెట్అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సెలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామీణ, జిల్లా స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించడం లేదని క్రికెటర్ల తల్లిదండ్రుల ఆరోపణలను ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు. హైదరాబాద్‌లో నివాసముండే నైపుణ్యంలేని క్రికెటర్లకు అవకాశం ఇస్తూ వారి దగ్గర లక్షలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ జిల్లాల్లో ఉంటున్న నైపుణ్యం కలిగిన క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం లేదని, ఇతర రాష్ట్రాల వారు డబ్బులిస్తే అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
