బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా సరే... సమాజంలో విధ్వంసం సృష్టించేలా, హింసను ప్రోత్సహించేలా మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, కానీ విధ్వంసానికి పిలుపునివ్వడం మూర్ఖత్వమని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాయకులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నీళ్లు లేక ఒడ్డున పడ్డ చేపలా... ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కొట్టుమిట్టాడుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పైసల కోసం ఆ పార్టీ నేతలు విలవిలలాడిపోతున్నారని ధ్వజమెత్తారు.
కేవలం పైసలు వసూలు చేయడం కోసం, ఉనికి చాటుకోవడం కోసమే... సింగరేణి ఆఫీసులను తగలబెట్టాలంటూ బాల్క సుమన్ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం సృష్టించడం ద్వారా సాధించేది ఏమీ ఉండదని, హింసను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేయాలన్నదే బీఆర్ఎస్ అసలు ధ్యేయమని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ఇటు ప్రజలు, అటు కార్మికులు అస్సలు పట్టించుకోవడం లేదు అనడానికి బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రత్యక్ష నిదర్శనమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
