
- ఐఏఎస్ కృష్ణయ్య కుటుంబానికి ప్రవీణ్ కుమార్ పరామర్శ
- కేసీఆర్ ఎవరి పక్షామో తేల్చుకోవాలి: లక్ష్మణ్
- ఆనంద్ మోహన్‌ను తెలంగాణలో అడుగుపెట్టనీయం: సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ జి.కృష్ణయ్యను హత్య చేసిన వ్యక్తిని బీహార్ ప్రభుత్వం జైలు నిబంధనలు మార్చి శిక్షా కాలం పూర్తి కాకముందే రిలీజ్ చేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనం పాటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ హత్యకు గురైతే.. దోషి ఆనంద్ మోహన్‌ను విడుదల చేయడాన్ని ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. శుక్రవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జి.కృష్ణయ్య కుటుంబాన్ని హైదరాబాద్ లో పరామర్శించారు. కృష్ణయ్య భార్య ఉమాదేవితో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రవీణ్ మాట్లాడారు. కృష్ణయ్యకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బీఎస్పీ పోరాడుతుందన్నారు. దోషి ఆనంద్ మోహన్ ను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీహార్ సీఎం నితీశ్ కు సీఎం కేసీఆర్ ఎందుకు లేఖ రాయడం లేదని నిలదీశారు.
కేసీఆర్.. ఎవరికి మద్దతుగా నిలుస్తవ్: లక్ష్మణ్
సీఎం కేసీఆర్ ఇప్పుడు తన దోస్తు , బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను సమర్థిస్తారా లేక ఐఏఎస్ అధికారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తారో లేదో చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏకంగా జైలు నిబంధనలు మార్చి ఆనంద్ మోహన్‌ను విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. ఐఏఎస్ అధికారిని హత్య చేసిన వ్యక్తిని విడుదల చేసి దేశ ప్రజలకు నితీశ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కృష్ణయ్య దళితుడు కాబట్టే న్యాయం జరగడం లేదన్నారు.
ఆనంద్‌కు అనుమతిస్తే తీవ్ర పరిణామాలు: సంజయ
ఆనంద్ మోహన్‌ను విడదల చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నితీశ్ వైఖరిపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పాలమూరు బిడ్డ కృష్ణయ్యను 1994లో అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్ మోహన్ హైదరాబాద్ వచ్చి కృష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారన్న వార్త తనను కలిచివేస్తోందన్నారు. నితీశ్ చర్యను కేసీఆర్ సమర్థిస్తున్నట్లు ఉందన్నారు. నితీశ్, కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకున్న తరువాతే ఆనంద మోహన్ హైదరాబాద్ వస్తున్నారని భావిస్తున్నామన్నారు. కృష్ణయ్యను చంపిన హంతకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వబోమని చెప్పారు. అతడు హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు.