తెలంగాణలో బీజేపీకి 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తయ్ : బండి సంజయ్

తెలంగాణలో బీజేపీకి 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తయ్ : బండి సంజయ్
  • బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే
  • మోదీ వర్సెస్ రాహుల్ గానే లోక్ సభ ఎన్నికలు: బండి సంజయ్
  • రాష్ట్రంలో బీజేపీకి 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా

కరీంనగర్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనే నినాదంతోనే జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా 80 శాతానికిపైగా ప్రజలు మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలోనూ బీజేపీ 8 నుంచి 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లోని శుభమంగళ గార్డెన్స్ లో మంగళవారం బీజేపీ మండలాధ్యక్షులతోపాటు కొత్తగా ఎంపిక చేసిన మండల ఇన్​చార్జ్​ల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, ఉద్యోగుల జీతాలకు కూడా పైసల్లేవన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదన్నారు.

మోదీ లేని భారత్​ను ఊహించలేం

దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నదని, ఈసారి బీజేపీకి సొంతంగా 350 సీట్లు, ఎన్డీఏ కూటమికి 4 00కు పైగా సీట్లు రాబోతున్నాయని సంజయ్ జోస్యం చెప్పారు. మోదీ లేని భారత్ ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడం ఖాయం. పొరపాటున ఎవరైనా బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే. ఎందుకంటే గల్లీలో, ఢిల్లీలో అధికారంలో లేని పార్టీ. ఒకవేళ ఆ పార్టీ ఎంపీలు గెలిచినా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. అదే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో మోదీ ప్రభుత్వమే ఉన్నందున, రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అదనపు నిధులను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది’ అని అన్నారు.