హిందూ సమాజాన్ని కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు : బండి సంజయ్ 

హిందూ సమాజాన్ని కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు : బండి సంజయ్ 

ఢిల్లీ : యాదాద్రిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థిస్తారా..? లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధానిని విమర్శిస్తారా..? అని మండిపడ్డారు. యాదాద్రి దేవాలయంపై పెట్టుబడి పెట్టామని కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి దేవాలయానికి ప్రతిరోజు కోటి రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేందుకు కేటీఆర్ కు మాటలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధిపై డబ్బులు ఖర్చుపెట్టి.. హుండీ డబ్బులను  వ్యాపారపరంగా కేటీఆర్ ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాలను కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.  ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ము కేటీఆర్ కు ఉందా..? అని ప్రశ్నించారు. 

యాదాద్రి పక్కనున్న భూములన్నింటినీ కబ్జా చేశారని బండి సంజయ్ ఆరోపించారు. భూముల రేట్లను పెంచుకునేందుకే యాదాద్రిని అభివృద్ధి చేశారని చెప్పారు. నయీం ఆస్తులు, డైరీ ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నయీంపై వేసిన సిట్ విచారణ ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నించారు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. నయీం కబ్జా చేసిన స్థలాలను ఇప్పుడు కేసీఆర్ కబ్జా చేశారని వ్యాఖ్యానించారు. అయ్యప్ప స్వామిని తిట్టిన వారి గురించి స్పందించరని, దీనిపై హిందూ సమాజం ఆలోచించాలని కోరారు. దేవాలయాలను హిందువులు పవిత్రంగా భావిస్తారని, వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చేలా కేసీఆర్ కుటుంబం చేస్తోందన్నారు. హిందువులను రాచి రంపాన పెట్టిన నిజాం మనవడు 8వ నిజాం ముకరం ఝాకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు డీఎన్ఏ టెస్ట్ చేయించాలన్నారు. ముఖ్యమంత్రి డ్రామాలు చేస్తున్నారని, నటనలో జీవిస్తున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.