సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ స్టార్ట్.. ఈ అంశాలపైనే ప్రధాన చర్చ..!

సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ స్టార్ట్.. ఈ అంశాలపైనే ప్రధాన చర్చ..!

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (ఫిబ్రవరి 23) సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక భేటీలో ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుతో పాటు వార్షిక బడ్జెట్ పద్దుల ప్రపోజల్స్‌‌పై మంత్రులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. 

ఉద్యోగుల క్యాష్ లెస్ ట్రీట్‌‌మెంట్‌‌ కోసం 1.5 శాతం విరాళం చెల్లింపు, విధి విధానాలు, ఎంప్లాయిస్​ హెల్త్​ కేర్​ ట్రస్ట్‌‌కు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నది. అలాగే.. విద్యా, సహకార రంగాల బలోపేతానికి వీలుగా రెసిడెన్షియల్ స్కూల్స్‌‌కు, డీసీసీబీ భవన నిర్మాణాలకు, పలు ఇతర సంస్థలకు అవసరమైన భూముల కేటాయింపులపై మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. 

నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చే హెచ్‌‌ఎంఆర్‌‌ఎల్ మెట్రో టేకోవర్ పురోగతి, అదనపు బోగీల ఏర్పాటు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనంలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపైనా లోతైన చర్చ జరగనున్నది. అలాగే,  యాసంగి రైతు భరోసా నిధుల విడుదలతోపాటు దేవాదుల ప్యాకేజీ-3 పనుల కొనసాగింపునకు అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను ఆమోదించనున్నారు. కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్లలో (జీహెచ్‌‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడులపై చర్చ..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడుల అంచనాలను బేరీజు వేసుకుంటూ వార్షిక బడ్జెట్‌‌ రూపకల్పనపై చర్చించనున్నట్టు తెలిసింది. దీనికి తగ్గట్టుగా మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నది.  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టు పనుల వేగం పెంచే దిశగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై మంత్రులతో కలిసి సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. 

ఇక ఉత్కంఠ రేపుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పట్లో షెడ్యూల్ వచ్చే అవకాశం లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. జిల్లాల్లో కీలకమైన డీసీసీలకు దాదాపు 10 రోజులపాటు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాలు కొనసాగుతుండటం పాలనాపరంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారింది. దీనికితోడు మార్చి మొదటివారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ పనుల్లోనే నిమగ్నం కానున్నది. 

ఇంటర్మీడియెట్, టెన్త్ బోర్డు పరీక్షలు వరుసగా ఉండటం వల్ల విద్యా, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు ఏమాత్రం తీరిక ఉండదు. అన్ని ప్రాధాన్యతా అంశాలు, పరీక్షలు పూర్తయిన తర్వాతే ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని సర్కారు సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదనే సంకేతాలు ఈ సమావేశం ద్వారా వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.