న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మంగళవారం ఉదయం ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 150 మంది ప్రయాణికులతో లేహ్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం, ఇంజిన్ వైఫల్యం కారణంగా గంట తిరగకముందే తిరిగి ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఎం జరిగిందంటే.. ఈరోజు (ఫిబ్రవరి 24) ఉదయం 6:08 గంటలకు స్పైస్‌జెట్ (SG121) బోయింగ్ 737 విమానం ఢిల్లీ నుండి లేహ్‌కు బయలుదేరింది. విమానం గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు వెంటనే అప్రమత్తమై ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.
విమానాశ్రయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:49 గంటలకు విమానం సురక్షితంగా వెనక్కి వచ్చి ల్యాండ్ అయింది.
విమానంలో ఉన్న సుమారు 150 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారంతా క్షేమంగా దిగారని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. అయితే సాంకేతిక సమస్య కారణంగానే విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని స్పైస్‌జెట్ సంస్థ పేర్కొంది.
