బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఇన్సూరెన్స్ ‘మిస్ సెల్లింగ్’పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ అసలు పనిని వదిలేసి.. ఇన్సూరెన్స్ ఉత్పత్తులను కస్టమర్ల నెత్తిన రుద్దడంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. బ్యాంకులు కేవలం సేల్స్ ఏజెంట్లుగా మారకూడదని మండిపడ్డారు.
అసలు పని వదిలేసి అదేమిటి..?
బ్యాంకుల మెయిన్ బిజినెస్ డిపాజిట్లను సేకరించడం, రుణాలు ఇవ్వడం. కానీ ప్రస్తుతం బ్యాంకులు తమ కోర్ బ్యాంకింగ్ వ్యాపారం కంటే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అమ్మడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయని నిర్మలమ్మ అసహనం వ్యక్తం చేశారు. అవసరం లేకపోయినా కస్టమర్లపై ఇన్సూరెన్స్ పాలసీలను బలవంతంగా రుద్దడం వల్ల సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కస్టమర్ల ఆర్థిక పరిస్థితిని, వారి అవసరాలను అర్థం చేసుకోకుండా కేవలం టార్గెట్ల కోసమే ఇలా చేయడం సరికాదని స్పష్టం చేశారు.
నలిగిపోతున్న కస్టమర్లు:
మిస్ సెల్లింగ్ లో ఉన్న ఒక పెద్ద లొసుగును మంత్రి ఎత్తిచూపారు. బ్యాంకులు ఇన్సూరెన్స్ అమ్ముతున్నాయి కాబట్టి అది తమ పరిధిలోకి రాదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ IRDAI భావిస్తోంది. మరోవైపు ఇది ఇన్సూరెన్స్ వ్యాపారం కాబట్టి తమకు సంబంధం లేదని ఆర్‌బీఐ అనుకుంటోంది. ఈ రెండు నియంత్రణ సంస్థల మధ్య ఉన్న గ్రే ఏరియా వల్ల సామాన్య డిపాజిట్ దారుడు బలైపోతున్నాడని ఆర్థిక మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇన్సూరెన్స్ ఎందుకు? అని అడిగే కస్టమర్‌కు బ్యాంకుల్లో సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడని వాస్తవాలను బయటపెట్టారు.
ఆర్‌బీఐ కఠిన చర్యలు:
ఈ సమస్య పరిష్కారానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలను నిర్మలా సీతారామన్ స్వాగతించారు. ఫిబ్రవరి 11న ఆర్‌బీఐ విడుదల చేసిన డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం.. మిస్ సెల్లింగ్ జరిగినట్లు తేలితే.. బ్యాంకులు కస్టమర్ చెల్లించిన పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయడమే కాకుండా, వారికి జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ జూలై 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమలైతే బ్యాంకు ఉద్యోగులపై ఉన్న టార్గెట్ల ప్రెషర్ తగ్గి, కస్టమర్లకు మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
క్లెయిమ్స్ దగ్గర తిప్పలు:
పాలసీ అమ్మేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉండే ప్రాసెస్.. క్లెయిమ్స్ కోసం వెళ్లినప్పుడు మాత్రం అత్యంత కష్టంగా మారుతోందని మీడియా రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్లు కమీషన్ల కోసం ఇన్సూరెన్స్ షరతులను పూర్తిగా వివరించకుండానే ఇన్వెస్టర్లకు అంటగడుతున్నారు. తీరా ఆపద వచ్చినప్పుడు నిబంధనలు అడ్డంకిగా మారి కస్టమర్లు రోడ్డున పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇకపై బ్యాంకులు లాభాల కంటే కస్టమర్ నమ్మకానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మలమ్మ మాటలు సూచిస్తున్నాయి. చూడాలి ఇకనైనా దేశంలోని బ్యాంకులు మారతాయో లేదో?
