భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా 'అశ్వత్థామ'గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ చూపించిన విశ్వరూపం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ఈ సెన్సేషన్‌కు కొనసాగింపుగా రాబోతున్న 'కల్కి 2' షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.
ఫ్యాన్స్‌కు క్షమాపణలు!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా తన బ్లాగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన తన బ్లాగ్ ద్వారా ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం 'జల్సా' వెలుపల తన అభిమానులను కలుస్తుంటారు.. అయితే, ఈ వారం ఆయన హైదరాబాద్‌లో 'కల్కి 2' షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్‌ను కలవలేకపోయారు. నేను ఈ ఆదివారం రావడం లేదని చెప్పినా, అభిమానులు నన్ను చూడటానికి వచ్చారు. చివరికి ఒక చిన్న కుక్క పిల్ల కూడా నా కోసం వేచి చూసింది. కానీ పని ముఖ్యం కదా.. అందుకే రాలేకపోయాను. వచ్చే ఆదివారం తప్పకుండా కలుస్తాను అని తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అశ్వత్థామ గెటప్‌లో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.
40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్‌తో కలయిక!
దాదాపు 39 ఏళ్ల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. 1985లో వచ్చిన 'గిరఫ్తార్' సినిమాలో వీరిద్దరూ చివరిసారిగా కలిసి నటించారు. ఆ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మెరిశారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు 'కల్కి 2' కోసం కెమెరా ముందుకు రావడం సినీ ప్రియులకు కళ్ల పండుగే. మహా నటుడు కమల్ హాసన్‌ను కలవడం గొప్ప అనుభూతి.. 'గిరఫ్తార్' తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసి పని చేస్తున్నాం అని అమితాబ్ సంతోషం వ్యక్తం చేశారు. మొదటి భాగంలో కమల్ హాసన్ 'సుప్రీం యాస్కిన్'గా కొద్దిసేపు మాత్రమే కనిపించినప్పటికీ, రెండో భాగంలో ఆయన పాత్ర విశ్వరూపం చూపించబోతోంది. అశ్వత్థామ, యాస్కిన్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఈ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.
అశ్వత్థామగా మళ్ళీ రంగంలోకి..
స్టైలిస్ట్ అమృత రామ్ ఇప్పటికే క్లూ ఇచ్చినట్లుగా, అమితాబ్ తాజాగా కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. "కల్కి 2 పనులు మొదలయ్యాయి.. అశ్వత్థామగా మళ్ళీ కెమెరా ముందుకు రావడం సంతోషంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ కూడా త్వరలోనే ఈ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే రెట్టింపు విజువల్ ఎఫెక్ట్స్ , యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉండబోతోందని సమాచారం..
