ఢిల్లీ AI సమ్మిట్ నిరసన సెగ! చొక్కా విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్ట్!

ఢిల్లీ AI సమ్మిట్ నిరసన సెగ!  చొక్కా విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్ట్!

ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్ సందర్భంగా చొక్కాలు విప్పి నిరసన తెలిపిన ఘటనలో, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని భారత్ మండపం వద్ద AI సమ్మిట్ జరుగుతుండగా ఈ నిరసన జరిగింది.

ఈ నిరసన వెనుక ఉదయ్ భాను చిబ్ హస్తం ఉందని, దీనికి సంబంధించిన పూర్తి ప్లాన్ ఆయనకే తెలుసని పోలీసులు భావిస్తున్నారు. చాలా గంటల విచారణ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

 విచారణ సమయంలో ఉదయ్ భాను సరిగ్గా సమాధానాలు చెప్పలేదని, కొన్ని విషయాలను దాటవేసే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఆయనపై కుట్ర పూరిత చర్యలు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు బుక్  చేశారు.

ఈ నిరసన ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే మరికొందరిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్లో జితేంద్ర యాదవ్ ని అరెస్టు చేసి, రెండు రోజుల రిమాండ్‌కు తరలించగా.. గ్వాలియర్, భిండ్, ఝాన్సీ, లలిత్‌పూర్ ప్రాంతాలకు చెందిన రాజా గుర్జార్, బిమల్, ప్రద్యుమ్న, మోంటు శుక్లా అనే మరో నలుగురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
 
ఈ అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది.  శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఈ అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బాఘేల్ మాట్లాడుతూ.. యువత సమస్యలను లేవనెత్తడం నేరం కాదని, అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బెదిరింపులకు  భయపడమని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది.