
- ఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారు
- అధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిది
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు : ఇతర పార్టీల తరఫున గెలి చిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశాల్లేవని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ కింద అభివృద్ధి చేసే అవకాశాలున్నాయన్నారు. కరీంనగర్- –హసన్ పర్తి రైల్వే లేన్ సాధ్యాసాధ్యాలపై రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తయ్యాయని తెలిపారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా.. రాజకీయ లబ్ధి కోసం మరింత జఠిలం చేసి సమస్యను నాన్చుతూ వచ్చిందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో ఉన్నారని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశముందని తెలిపారు.
‘ఇప్పటికే కేసీఆర్ గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా? అని ప్రయత్నిస్తున్నాడు. ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నా’ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలన నిజంగా బాగుంటే..పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే కచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్టేట్ ప్రెసిడెంట్ మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు. రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట, కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపారు. అందుకోసం తాను తప్పకుండా కృషి చేస్తానని, వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతామని స్పష్టం చేశారు. కరీంనగర్ –హసన్పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగిందని, రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని వెల్లడించారు.