ఏడాది కష్టపడితే కాషాయ రాజ్యం వస్తది

ఏడాది కష్టపడితే కాషాయ రాజ్యం వస్తది

టీఆర్ఎస్ వెంటిలేటర్పై ఉన్న పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అన్నారు. నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. మునుగోడులో ఓడిపోతారన్న విషయం కేసీఆర్ కు తెలుసని.. అందులో బై పోల్ లో గెలుపు కోసం అమలుకాని హామీలు ఇచ్చేందుకు సిద్ధమైతుండని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మునుగోడులో బీజేపీనే గెలుపు ఖాయమని, సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. 

ఓట్ల కోసమే అంబేద్కర్ పేరు
ఉప ఎన్నికల్లో ఎస్సీ ఓట్ల కోసమే సెక్రటేరియెట్కు అంబేద్కర్ పేరు పెట్టిండని బండి ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కనీసం అంబేద్కర్ జయంతి, వర్థంతి కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. దళితున్ని సీఎం చేస్తా లేకపోతే  తల నరుక్కుంటానన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కొత్త సెక్రటేరియెట్లో దళిత సీఎంను కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. 

ఆదివాసీ మహిళల్ని జైలులో పెట్టిండు
గిరిజన, ఆదివాసీల విషయంలోనూ ముఖ్యమంత్రి మోసపూరితంగా వ్యవహరించారని బండి మండిపడ్డారు. ఎస్టీ అభ్యర్థిని రాష్ట్రపతిగా నిలబెడితే ఓడించాలని చూసిండని విమర్శించారు. ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆదివాసీ, గిరిజన మహిళలను జైలులో పెట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చురకలంటించారు. 

ఏడాదిలో కాషాయరాజ్యం
బీజేపీ కార్యకర్తల కమిట్మెంట్కు నాల్గో విడత పాదయాత్ర ముగింపు సభ నిదర్శనమని బండి అన్నారు. కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో ఏడాది కష్టపడితే కాషాయ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినం చేసుకుని గల్లీగల్లీలో జాతీయ జెండాలు రెపరెపలాడేలా అన్నారు. పాతబస్తీలో కూడా జాతీయ జెండాలు ఎగురవేసేలా చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందని చెప్పారు.